యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య రూపొందించిన చిత్రం.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారమే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ సినిమాకు రివ్యూలన్నీ కూడా చాలా వరకు నెగెటివ్గానే వచ్చాయి.
మౌత్ టాక్ కూడా మిక్స్డ్గానే ఉంది. ఐతే తమ చిత్రానికి కొందరు పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని హీరో విశ్వక్సేన్ ఆరోపించాడు. సినిమాలు చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని కూడా ఆరోపించాడతను. రివ్యూలను పట్టించుకోకుండా ప్రేక్షకులు తమ సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారని అతను చెప్పాడు.
‘‘తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల వరకే కాదు.. దేశంలోనే వసూళ్ల పరంగా మనం ముందున్నాం. కొన్ని రోజులుగా థియేటర్ల దగ్గర సందడి లేదు. కొంత విరామం తరువాత మళ్ళీ మా సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు.
కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూ రాస్తున్నారు. మరికొందరైతే కావాలని నెగటివ్ రివ్యూలు రాస్తున్నారు. అలాంటి రివ్యూలను పట్టించుకోకుండా.. ఎందరో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తున్నా’’ అని విశ్వక్ పేర్కొన్నాడు. సినిమాకు వస్తున్న స్పందనతో తాము చాలా సంతోషంగా ఉన్నామని.. త్వరలోనే సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తామని విశ్వక్ తెలిపాడు. అంతే కాక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి సీక్వెల్ కూడా కచ్చితంగా చేస్తామని.. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని విశ్వక్ చెప్పాడు.