విశాఖ రైల్వే జోన్ అన్నది ఈనాటిది కాదు. పాతికేళ్ళుగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. ఉద్యమాలు కూడా దీని కోసం ఎన్నో జరిగాయి. మొత్తానికి చూసుకుంటే రెండున్నరేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చి మరీ జోన్ ఇచ్చేశామని చెప్పేశారు. దాంతో విశాఖవాసులలో ఆనందం అంతా ఇంతా కాదు, అయితే అది ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఈ రోజుకీ జోన్ ఎక్కడ ఉంది అంటే కాగితాల మీదనే అని చెప్పాలి. జోన్ కి రెండేళ్ల క్రితం బడ్జెట్ లో గొప్పగా రు.75 కోట్లు కేటాయించారు. కానీ అందులో ఎంత ఖర్చు చేశారో ఈ రోజుకీ తెలియదు. మరో వైపు చూసుకుంటే జోన్ ఇచ్చామని చెప్పి వాల్తేరు డివిజన్ ని విశాఖ నుంచి లాగేశారు.
నూటయాభై ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ వాల్తేరు డివిజన్ దేశంలోనే అతి ఎక్కువ లాభాలు తెచ్చేదిగా ఉంది. దీన్ని విడగొడితే విశాఖ జోన్ నష్టాలలో ఉండడమే తప్ప దమ్మిడీ ఆదాయం రాదు. ఈ డివిజన్ ఆదాయం అంతా ఒడిశాకు వెళ్లిపోతుంది. వాల్తేరు డివిజన్ లేని విశాఖ రైల్వో జోన్ రెక్కలు లేని పక్షి లాంటిదే ? దాంతో వాల్తేరు డివిజన్ తో కూడిన జోన్ ఇవ్వండి అంటూ విశాఖ ప్రాజా ప్రతినిధులు గట్టిగా కోరుతున్నారు.
ఇక రైల్వే కార్మిక నాయకులు అయితే వాల్తేరు డివిజన్ని ముక్కలు చేయడం ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు. దానిలో లాభాలు వచ్చే భాగమంతా కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్ లో కలిపేస్తున్నారు. మిగిలిన ముక్కను విజయవాడ డివిజన్ లో విలీనం చేసి వాల్తేరు డివిజన్ లోకి రైల్వే కార్మికులను కూడా చెల్లాచెదురు చేశారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే బడ్జెట్ లో మాత్రం అసలు కేటాయింపులు లేవు. ఇంతకీ జోన్ కధ ఎందాకా వచ్చిందన్నది అందరికీ డౌటే.
దీని మీద టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అన్నీ పరిశీలించాలి. చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. అంటే జోన్ ఇప్పట్లో రాదా అంటే అదే నిజం అనుకోవాలి. ఇక వాల్తేరు డివిజన్ ని విశాఖ రైల్వే జోన్ లో కలిపి ఉంచాలన్న డిమాండ్ మీద కూడా కేంద్రం ఏమీ మాట్లాడడంలేదు.
మొత్తం మీద విశాఖ రైల్వే జోన్ కధ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని చెప్పాలి. దీని మీద ఏపీకి చెందిన ఎంపీలు అంతా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గట్టిగా పోరాడితే తప్ప సాకారం అయ్యేట్లుగా లేదు మరి.
అయితే ఏపీ ప్రయోజనాల కోసం పార్టీలు అన్ని ఏకతాటిమీదకు రావడం జరిగేలా లేదు. వీళ్ల బలహీనతలనే కేంద్రం వాడుకుని రైల్వేజోన్ విషయంలో ఓ ఆటాడుకుంటూ అనాథను చేసేసింది.