ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 గంటల సమయానికి 34.28 శాతంగా ఉన్న పోలింగ్…మధ్యాహ్నం 12.30 సమయానికి ఊపందుకుంది. చిత్తూరు జిల్లాలో 66.30 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 54.58, విశాఖ జిల్లాలో 65 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 62.14, పశ్చిమ గోదావరి జిల్లాలో 54.07, కృష్ణా జిల్లాలో 67 శాతం, గుంటూరు జిల్లాలో 62 శాతం, ప్రకాశం జిల్లాలో 57 శాతం, నెల్లూరు జిల్లాలో 61 శాతం, కర్నూలు జిల్లాలో 79.60, అనంతపురం జిల్లాలో 63 శాతం, కడప జిల్లాలో 61.19 శాతం ఓటింగ్ నమోదైంది. గుర్తుల కేటాయింపులో పొరపాట్ల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్డిగూడెం, బొప్పనపల్లిలో వార్డు ఎన్నికలను రెండో దశకు వాయిదా వేశారు.
మరోవైపు, పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల వైసీపీ నేతలు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో వైసీపీ కార్యకర్తలు కత్తులతో చెలరేగిపోయారు. దీంతో, టీడీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ కార్యకర్తలను గ్రామస్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బొట్లవారిపాలెంలో గత అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారులు కొందరు హల్చల్ చేసి ప్రత్యర్థులపై దాడికి దిగంతో బాధితులు నేడు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. జగన్ రూలింగ్ లో పోలింగ్…దాడులు, దౌర్జన్యాలతో కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు.
నెల్లూరు జిల్లా కావలి డివిజన్లో పోలీసులు ప్రదర్శిస్తోన్న తీరు దుర్మార్గమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు ఎస్సై పోలీసా? లేక వైసీపీ నాయకుడా? అంటూ ఆయన నిలదీశారు. ఉత్తర ఆములూరులో ఎన్నికల ఏజెంట్లను, టీడీపీ నేతల్ని కొట్టారని, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పోలీసులను అదుపు చేయాలని అన్నారు. పోలీసుల తీరును ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళుతున్నామని తెలిపారు.
వైసీపీ నేతలు తనను బెదిరించి బలవంతంగా వేలిముద్ర వేయించుకుని నామినేషన్ను ఉపసంహరింపజేశారని వినుకొండ మండలం, అందుగుల కొత్తపాలెం వార్డు మెంబర్ అభ్యర్థి హేమలత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నామినేషన్లో తాను సంతకం చేశానని, కానీ, అధికారులు వేలిముద్ర వేసిన పేపర్లను పరిగణలోకి తీసుకొని నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. అధికారులు, స్థానిక వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. జగన్ రూలింగ్ లో తొలి పోలింగ్ డే దౌర్జన్యాలు, దాడులతో నిండిపోయిందని విమర్శలు వస్తున్నాయి.