ఏపీలో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. విపక్షంలోకి రాగానే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కీలక నాయకులంతా పార్టీకి మరియు జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. గత మూడు నెలల నుంచి వైసీపీలో వలసల పర్వం ఆగకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్నటి నిన్న సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా బాలినేని బాటలోనే నడుస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వినుకొండ నియోజక టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందన్నారు. తల్లి కాంగ్రెస్(జాతీయ పార్టీ కాంగ్రెస్)లోకి పిల్ల కాంగ్రెస్(వైఎస్ఆర్సీపీ) కలుస్తుందని.. ఇప్పటికే జగన్ బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్తో డీల్ సెట్ చేసుకున్నారని జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు.
వైసీపీలో వలసల పర్వానికి రీజన్ అదే అని.. తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ కలిసిపోబోతోందని తెలిసే కొంత మంది వైసీపీ నేతలు ముందస్తుగా తమ దారి తాము చేసుకుంటున్నారని.. కానీ వీళ్ళందరి కన్నా ముందే జగన్ రెడ్డి బెంగుళూరులో దారులు వెతుక్కుంటున్నాడని జీవీ సెటైర్లు పేల్చారు. ఏపీలో కూటమి 100 రోజుల పాలన అద్భుతంగా సాగింది.. చంద్రబాబు-పవన్ జోడీ సూపర్ సక్సెస్ అయిందని జీవీ పేర్కొన్నారు. వంద రోజుల పాలన చూశాక వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని.. ఇక పార్టీ మనుగడ కష్టమనే తెలియడంతో రోజుకొకరు సైడ్ అవుతున్నారని జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు.