విక్రమ్.. ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ఒక టైంలో స్వామి (లక్ష్మీ నరసింహ ఒరిజినల్), పితామగన్ (శివపుత్రుడు), అన్నియన్ (అపరిచితుడు) లాంటి బ్లాక్బస్టర్లతో అతను మామూలు ఫాంలో లేడప్పుడు.
తమిళంతో పాటు వేరే భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని తిరుగులేని స్థితిలో నిలిచాడు. కానీ ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా విక్రమ్ నుంచి ఒక్కటంటే ఒక్క నిఖార్సయిన హిట్టు రాలేదు. శంకర్ తీసిన ‘ఐ’ సహా అన్నీ నిరాశ పరిచినవే.
గత కొన్నేళ్లలో అయితే విక్రమ్ నుంచి మరీ నాసిరకం సినిమాలు వచ్చాయి. అతడి మీద అభిమానులు పూర్తిగా ఆశలు కోల్పోయారు. కోబ్రా అని, మహాన్ అని వేరే సినిమాలేవో చేస్తున్నాడు కానీ.. వాటి మీదా అంచనాలు అంతమాత్రమే. అవి విడుదలై సరైన ఫలితాన్నందుకుంటే ఏమైనా అతడి కెరీర్ మారుతుందేమో అన్న ఆశతో అభిమానులు ఉన్నారు. ఐతే ఇప్పుడు విక్రమ్ ఊహించని కాంబినేషన్లో సినిమాకు రెడీ అయ్యాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ లాంటి డిజాస్టర్లు తీసి ఆయన కెరీర్‌ను చాలా దెబ్బ తీశాడు రంజిత్. ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని అతను ఈ మధ్యే ‘సార్పట్ట’ అనే బాక్సింగ్ మూవీ తీశాడు. ఆర్య హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది.
ఈ సినిమాతో కాస్తా ఫాంలోకి వచ్చిన రంజిత్.. ఇప్పుడు తన తర్వాతి చిత్రానికి విక్రమ్‌ను హీరోగా ఎంచుకున్నాడు. ఓ ప్రముఖ తమిళ నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రంజిత్ తీసే సినిమాలకు.. విక్రమ్ చేసే సినిమాలకు సంబంధం ఉండదు. ఇద్దరి దారులు వేరు. ఈ కాంబినేషన్లో సినిమా ఎవ్వరూ ఊహించనిది.
తొలి రెండు చిత్రాలతో పెద్ద హిట్లిచ్చి ఆ తర్వాత రజినీ లాంటి సూపర్ స్టార్‌తో వరుసగా రెండు సినిమాలు చేసే ఛాన్సొస్తే వాటిని ఎంతమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు రంజిత్. మరి ఈ దర్శకుడు విజయం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న విక్రమ్‌తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.