ఏపీలో ఇంతే గురూ! సోషల్ మీడియాలో ఇప్పుడు జోరందుకున్న కామెంట్ ఇది! గత చంద్రబాబు ప్రభు త్వం చమటోడ్చి తెచ్చిన ప్రాజెక్టులకు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ రిబ్బన్ కటింగులు చేస్తున్నారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన చాలా కార్యక్రమాలు చంద్రబాబు ఖాతాలోవే.. అయినప్పటికీ.. ఖర్చు మాత్రం.. జగన్ ఖాతాలోనే పడుతుండడం గమనార్హం.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం కావొచ్చు.. అనంతపురం జిల్లాలోని కియా కార్ల కంపెనీ కావొచ్చు.. ఇలా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
ఇక, తాజాగా కృష్ణాజిల్లా విజయవాడలోనూ చంద్రబాబు హయాంలో చేసిన కీలక ప్రతిపాదన కు ఇప్పుడు జగన్ శంకు స్థాపన చేస్తూ.. తన ఖాతాలో వేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
విజయవాడ నగరం నడిబొడ్డున ప్రవహించే కృష్ణానదికి ఏటా రెండు సార్లు వరదలు వస్తుంటాయి. అది కూడా వర్షాకాలంలోనే. ఈ సమయంలో కృష్ణానది వెంబడి.. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్నరాణీగారి తోట, కృష్ణలంక వంటి ప్రాంతాలు ఈ వరద కారణంగా ముంపునకు గురవుతున్నాయి. కనీసం ఏడాది రెండు సార్లు పదేసి రోజుల చొప్పున ఇక్కడి వేలాది కుటుంబాలకు ఈ వరద ముంపు… ముప్పుగా పరిణమించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్యను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. అప్పటి తూర్పు నియోజకవ ర్గం ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి రంగా.. ఈ వరద నియంత్రణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను ఉమ్మడి ప్రభుత్వానికి పంపారు. కానీ. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో ఎప్పుడు వరద వచ్చినా.. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడం.. సాయం అందించడం.. తిరిగి వరద తగ్గాక వారిని అవే ఇళ్లకు పంపించడం ఆనవాయితీగా మారింది.
2016-17-18 సంవత్సరాల్లోల వచ్చిన వరదలను అత్యతం దగ్గరగా గమనించిన అప్పటి సీఎం చంద్రబాబు.. ఈ కృష్ణానది వరదలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ వరద నియంత్రణకు, కృష్ణలంక, రాణీగారితోట సహా బస్టాండ్ సమీపంలోని ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణానది వెంబడి.. ఆయా ప్రాంతాలను కలుపుతూ.. భారీ రిటైనింగ్ వాల్‌ను నిర్మించాలనని ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.. అయితే.. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందే సరికి ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం తెలిసిందే.
ఇప్పుడు అవే ప్రతిపాదనల్లో చిన్నపాటి మార్పులు చేసిన జగన్ సర్కారు… రిటైనింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.125 కోట్ల వ్యయంతో రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి బుధవారం సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.
దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు కూడా సర్కారు రెడీ కావడం విశేషం. అయితే.. ఇది బాబు ప్రతిపాదన కావడంతో టీడీపీ నాయకులు కుమిలి పోతున్నారు. “మేం మా హయాంలో అనేక కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేశాం. ఈ ఒక్కటి కూడా నిర్మించేసి ఉంటే.. బాగుండేది“ అని విజయవాడకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.