విజయవాడ వాసులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. ట్రాఫిక్ సమస్యలతో అల్లాడిపోతున్న ఆ నగరవాసుల కష్టాలు తీర్చడానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
కొన్ని నెలల ముందే ఈ ఫ్లైఓవర్ సిద్ధమైనప్పటికీ కరోనా నేపథ్యంలో దాన్ని ఆరంభించడంలో ఆలస్యం జరిగింది. గడ్కరీ చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరిగినప్పటికీ.. ఆయన కరోనా బారిన పడటంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.
ఇప్పుడు గడ్కరీ కోలుకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ వరకు ప్రయాణం చేయడం, జనాల మధ్య ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం మంచిది కాదని.. ఆయన వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలోని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ఫ్లైఓవర్.. ఆ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభం కూడా కావాల్సింది. కానీ ఫ్లైఓవర్ చివరి దశలో ఉండగా ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఫ్లైఓవర్‌ను నిర్లక్ష్యం చేసింది. ఈ ఫ్లైఓవర్‌ను వెంటనే ఆరంభిస్తే దాని క్రెడిట్ బాబుకు వెళ్తుందన్న ఉద్దేశంతో దాన్ని ఆలస్యం చేశారన్న విమర్శలున్నాయి.
ఒకప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆ పార్టీ వ్యతిరేకించడం గమనార్హం. ఐతే ఇప్పుడు మాత్రం దాని క్రెడిట్ తీసుకోవడానికి వైకాపా మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఏం చేసినా క్రెడిట్ బాబుకు వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఫ్లైఓవర్ ఆరంభ కార్యక్రమాన్ని వర్చువల్‌గా కానిచ్చేశారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా టైంలోనే మరెన్నో కార్యక్రమాలను జనాల హంగామా మధ్య జరిపించిన జగన్ సర్కారు.. కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో మాత్రం వర్చువల్ రూట్‌కు వెళ్లడం ఈ సందేహాల్ని పెంచేదే.