దేశ రాజధాని ఢిల్లీలో మూడు..నాలుగు రోజుల క్రితం జరిగిన దాని గురించి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పడుతున్న ఆవేదన ఇప్పుడు కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. కొన్ని విషయాలకు ఎంతటి ప్రచారం అవసరమో.. మరికొన్ని అంశాలకు ఎంత మౌనంగా ఉంటే అంతే మంచిది. ఈ చిన్న లాజిక్ ను వైసీపీ వ్యూహ కమిటీ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. మోడీని.. చంద్రబాబును కలవటం.. ఆయన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన విషయానికి సంబంధించిన వార్త చాలా అప్రాధాన్యతతో వచ్చింది. అది కూడా వైసీపీ నేతలు తరుచూ ఆరోపించే పచ్చ మీడియాలో. దాని మానాన దాన్ని వదిలేస్తే.. విషయం చాలామందికి అసలు తెలిసేదే కాదు.
అందుకు భిన్నంగా వైసీపీ కీలక నేతలు తగదునమ్మా అంటూ బయటకు వచ్చి.. చంద్రబాబును తిట్టటానికి ఇంతకు మించిన మరో సదవకాశం లేనట్లుగా వ్యవహరించిన తీరుతో విషయం మరింత తేడా కొట్టేసిన పరిస్థితి. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించే సజ్జల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఇమేజ్ మరింత పెరగటంతో పాటు.. మోడీ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యతను ఇవ్వటాన్ని భరించలేకనే సజ్జల ఇంత సీరియస్ అవుతున్నారన్న ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయింది.
తాము ఒకటి అనుకుంటే.. మరొకటి జరగకూడదు. అది కూడా రాజకీయాల్లో. అలా జరిగితే నెగిటివ్ ఇంపాక్టుగా మారి తాము అనుకున్న దానికి మించిన నష్టం వాటిల్లుతుందన్నది మర్చిపోకూడదు. సజ్జల చేసిన డ్యామేజ్ సరిపోతుందా? అని తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రంగంలోకి దిగారు. నాలుగు ట్వీట్లు చేసి.. చంద్రబాబును ఉతికి ఆరేశామని సంతోషపడుతున్నట్లుగా ఉంది. కానీ.. వారు చేసింది మహా తప్పన్న విషయాన్ని వారు గుర్తించలేదు.
పెద్దగా ప్రాధాన్యత లేని అంశానికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా.. తామే అందరికి విషయం తెలిసేలా చేస్తున్నామన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఆవేశం మనిషికి ఉండే ఆలోచనను దెబ్బ తీస్తుంది. ఇందుకు విజయసాయి కూడా మినహాయింపు కాదు. ఆయన నాలుగు ట్వీట్లను చూస్తే.. ఆయన బాబు పరువు తీయటం కాదు.. బాబును తిట్టేయటం ద్వారా తాను ఎంతగానో అభిమానించి.. ఆరాధించే జగన్ పరువును.. ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్న విషయాన్ని గమనించలేని దుస్థితి. అదెలా అన్నది విజయసాయి వారి మాటల్లోనే చూద్దాం.
మొదటి ట్వీట్ లో.. వీరావేశంగా ఆయన బోలెడన్ని విషయాలు చెప్పేయటం ద్వారా జగన్ గారి గాలి ఇట్టే తీసేశారని చెప్పాలి. అదెలానో తెలుసుకునే ముందు.. విజయసాయి వారి ట్వీట్ లోని అక్షర రత్నాల మీద ఒక లుక్ వేస్తే మరింత క్లారిటీ వస్తుంది.
‘‘నీతీ ఆయోగ్ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్ నెంబర్:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఒకరు’’
ఈ ట్వీట్ లోని విషయాన్ని విజయసాయి చెప్పింది చూశాం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇలా చూస్తే విషయం మరోలా అర్థమవుతుంది. విజయసాయి పేర్కొన్నట్లుగా లంచ్ విందులో టేబుల్ వన్ లో ముగ్గురు సీఎంలు.. ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు.. ప్రధాని మోడీ ఉన్నారు.
ఆ ముగ్గురు సీఎంలలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్న మురిపెం వరకు ఓకే. కానీ.. ఇంతమందితో కలిసి కూర్చున్నప్పుడు.. అందరిలో ఒకరే తప్పించి.. జగన్ కు ప్రత్యేకంగా ఇచ్చిన మర్యాద.. గౌరవం అంటూ ఏమైనా ఉంది? అలా కాకుండా.. అక్కడున్న ముఖ్యమంత్రుల్ని.. లెఫ్టినెంట్ గవర్నర్లను పక్కనపెట్టేసి.. ఒకే టేబుల్ మీద ప్రధాని మోడీ.. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కలిసి లంచ్ చేసి ఉంటే.. ఆ లెక్కనే వేరేగా ఉండేది కదా? అలా జరగనప్పుడు దానికి అంత ఎగిరి పడటం వల్ల లాభమా? నష్టమా?
విజయసాయి వారి రెండో అద్భుత ట్వీట్ ను తప్పక చూడాల్సిందే. ఎందుకంటే.. ఇందులో ఆయన జగన్ పరువును ఎంత తీయాలో అంత తీశారన్న భావన వ్యక్తమవుతోంది.
‘‘కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకులమీడియా స్థాయి ఎక్కడ? ’’
గంటకు పైగా ఒకే టేబుల్ దగ్గర విందులో మాట్లాడుకున్నా కూడా ప్రచారం కోరుకోని జగన్ స్థాయి ఎక్కడ? అంటూ సూటిగా ప్రశ్నించిన విజయసాయి రెడ్డి మాటల్లో డొల్లతనం ఇట్టే కనిపించింది. గంట పాటు విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోలేదని విజయసాయి చెప్పిందే నిజమే అనుకుందాం. మరి.. ఈ ట్వీట్ తో విజయసాయి చేసిందేమిటి? గంట పాటు లంచ్ విందులో ఉన్నారని చెప్పటం ద్వారా ప్రచారాన్ని కోరుకోవటం కాదా? ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. జగన్ మోడీతో కూర్చున్న ఫొటో వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తించారు. మరి అది ప్రచారం కాదా?
‘ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు ఐదు గంటలకు సరిపడా కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకుల మీడియా స్థాయి ఎక్కడ?’ అని ప్రశ్నించటం చూస్తే.. విజయసాయి మాటల్లో డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది.
ఆ మీడియా చంద్రబాబు గొప్పతనాన్ని కీర్తించిందనే అనుకుందాం. దాన్ని లాగి.. పీకి.. ఇంత భారీగా విషయాన్ని తయారు చేసింది వైసీపీ నేతలే కదా? నిజానికి ప్రధానితో మాట్లాడిన మాటల్ని ఆ మీడియాకు నిజంగానే బాబు దత్తపుత్రుడు అయితే.. బ్యానర్ వార్త వేయాలి కదా? అలా కాకుండా ఒక చిన్న కాలమ్ లో.. ఒక అప్రాధాన్యత వార్తగా ఎందుకు వేస్తారు? దానికి బోలెడంత ప్రచారాన్ని కల్పించింది ఎవరు? లాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు వేళ్లు జగన్ అండ్ కో వైపు చూపిస్తాయి.
ఇన్ని చేసి.. ఎదుటోళ్ల మీద పడటం చూసేందుకు బాగానే ఉన్నా.. విషయం అర్థమైనోళ్లు మాత్రం తమను ఏమనుకుంటారన్న విషయాన్ని విజయసాయి అర్థం చేసుకుంటే.. ఆయన తీరులో మార్పు ఖాయం. కానీ.. ఆయనకు అంత ఓపిక ఉందంటారా?