అనూహ్యంగా వచ్చిన క్రేజ్ తో యూత్ ఐకాన్ స్టార్ గా మారారు విజయ దేవరకొండ. ఆయన సినిమా అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా భారీ బడ్జెట్ తో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ కే పరిమితమైన అతగాడి క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో.. పక్కా ప్లానింగ్ తో రూపొందించిన మూవీ లైగర్. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ లో కీ రోల్ ప్లే చేసే కరణ్ జోహార్ కూడా చేతులు కలపటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్స్ లో ఘనంగా విడుదల చేశారు. విజయ్ ను చూసేందుకు భారీగా ఆయన అభిమానులు తరలి రావటంతో పాటు.. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయటంతో సందడి వాతావరణం నెలకొంది. సంప్రదాయ పద్దతిలో కోలాటాలు.. డ్యాన్సులు.. బోనాలతో పాటు.. అవి ఇవి అన్న తేడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
పేరుకు ట్రైలర్ విడుదలనే కానీ ఓపెద్దసైజు వేడుక అన్నట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించటమే కాదు.. ఈ ప్రోగ్రామ్ కు కరణ్ జోహార్ రావటంతో.. ఈ సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. అభిమానుల సందడిని చూసిన విజయ దేవరకొండ ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. తనకు డాన్స్ంట్ చిరాకని.. అయినా డాన్స్ చేశానంటే కారణం.. తన ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పారు.
తాజా సినిమాను తన ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘ఆగస్టు 25న థియేటర్లు నిండిపోవాలి. గ్యారెంటీగా చెబుతున్నా.. ఆగస్టు 25న ఇండియా షేక్ అయిపోతుంది’ అంటూ అభిమానులు ఉర్రూతలూగేలా మాట్లాడిన విజయ్ మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే, సినిమా విడుదలకు ముందు పూరీ ఈ టైప్ ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగులు చెబుతుంటారని, ఆ మ్యాటర్లో పూరీని బీట్ చేసిన రౌడీ హీరో లెక్క కరెక్టో కాదో తేలాల్సి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.