సరైన సినిమా ఒక్కటి పడితే చాలు.. యువ దర్శకుల రాత మారిపోతుంది. పెద్ద పెద్ద స్టార్లు పిలిచి మరీ ఛాన్సులిచ్చేస్తారు. రన్ రాజా రన్‌తో సుజీత్, జిల్ మూవీతో రాధాకృష్ణకుమార్ మెప్పించి ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకోవడం తెలిసిందే. ప్రభాస్ అనే కాదు.. సీనియర్ హీరోలు సైతం యువ దర్శకులను నమ్మి అవకాశాలిస్తున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సైతం ఓ యువ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఆ దర్శకుడెవరో కాదు.. అనుదీప్ కేవీ.
పిట్టగోడ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనుదీప్‌కు తొలి చిత్రం చేదు అనుభవమే మిగిల్చింది. కానీ ఆ తర్వాత జాతిరత్నాలుతో అతను ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఓ ద్విభాషా చిత్రాన్ని అతను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అతను విక్టరీ వెంకటేష్‌కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ కూడా ఖరారైందట.
వరుస చిత్రాలతో మంచి ఊపు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వెంకీ-అనుదీప్ కాంబినేషన్లో సినిమాను నిర్మించబోతోందట. గత ఏడాది నారప్ప, దృశ్యం-2 చిత్రాలతో పలకరించిన వెంకీ.. ప్రస్తుతం ఎఫ్-3 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి దశలో ఉంది. మరోవైపు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ఇవి పూర్తి కాగానే వెంకీ చేయబోయే సినిమా అనుదీప్తోనే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట.