సమకాలీన రాజకీయాలలో రాజకీయ నేతలు గోడ దూకినంత ఈజీగా పార్టీలు మారుతున్న వైనంపై రాజకీయ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలుగా ఆయారాం గయారాంల హవా ఎక్కువైందని, పూటకో కండువా కప్పుకుంటూ రాజకీయాలను కొందరు నేతలు అపహాస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో జరిగిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెంకయ్య నాయుడు నేటి రాజకీయాలపై, రాజకీయ నాయకుల నిలకడలేమిపై ఆసక్తికర కామెంట్లు చేశారు. భుజంపై కండువాలు మార్చినంత ఈజీగా కొందరు రాజకీయ నేతలు పార్టీలు మారుతున్నారని వెంకయ్య నాయుడు చురకలంటించారు. అవలీలగా పార్టీలు మారుతున్న నేతలు ఆ పార్టీ మారడం ద్వారా పొందిన పదవిని కూడా వదిలేసి రావాలని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేయాలని, కానీ ఈ రోజుల్లో కోట్లు ఉంటేనే ఓట్లు అనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో, చట్టసభలలో పద్ధతిగా మాట్లాడితే వార్తల్లో గుర్తింపు రావడంలేదని, వక్రంగా, వ్యంగ్యంగా చమత్కారంగా మాట్లాడితేనే పేరు వస్తోందని వ్యాఖ్యానించారు.