ప్రస్తుతం అమరావతి రాజధాని వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అమరావతే రాజధాని అని, 3 రాజధానుల గురించి తమను ఏపీ ప్రభుత్వం సంప్రదించలేదని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటనతో మరోసారి ఏపీ రాజధాని అమరావతిపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడుకు రాజధానిపై ప్రశ్న ఎదురైంది. తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, కానీ, అమరావతిపై తన అభిప్రాయం గతలో చెప్పానని వెంకయ్య అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ప్రధానితో కలిసి అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్నానని, పట్టణాభివృద్ధి మంత్రిగా అమరావతికి నిధులు కూడా మంజూరు చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే అమరావతిపై తన స్టాండ్ ఏంటో అర్థమై ఉంటుందంటూ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని, వాటిపై ఆసక్తి లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. కానీ, అనూహ్యంగా విద్యార్థుల నుంచి అమరావతిపై ప్రశ్న ఎదురు కావడంతో వెంకయ్య నర్మగర్భంగా అమరావతే రాజధాని అని పరోక్షంగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది.