మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ నాయకులు ఎం. వెంకయ్య నాయుడు తాజాగా ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. వివిధ కార్యాక్రమాల నిమిత్తం ఏపీలో పర్యటిస్తున్న ఆయన పశ్చిమ గోదావరిలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఈ సమయంలో విద్యార్థులు కొందరు ఆయనను ఏపీ రాజధానిపై ప్రశ్నించారు. మూడు రాజధానులపై మీ అభిప్రాయం చెప్పాలని వెంకయ్యను కోరారు. దీనికి ఆయన ముందు సమాధానం చెప్పేందుకు తటపటాయించారు.
అయితే, ఆ వెంటనే ఏమాత్రం తడుము కోకుండా.. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని తెలిపారు.
అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని గుర్తుచే శారు. విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా.. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే.. మరో విద్యార్థి స్పందిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది.. దీనిపై ఏమంటారు? అని ప్రశ్నించారు.
దీనిపై స్పందిస్తూ.. ఆర్థికంగా బాగుంటే.. అప్పుడు ఎన్ని నిర్ణయాలు అయినా.. తీసుకోవచ్చని.. వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి తనకు తెలిసినంత వరకు ఆర్థికంగా బాగోలేదని చెప్పారు. అప్పులు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయన్న ఆయన అయితే.. అన్నింటికీ ఆర్థికంగా ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయని.. కానీ, ఏపీకి మాత్రం లేవని చెప్పారు. ఒకప్పుడు అమృత్ పథకంలో కొన్ని నగరాలను ఎంపిక చేశామని.. ఇటీవల కాలంలో ఏపీ అసలు ఈ మాటే వినిపించడం లేదని చెప్పారు.
ఎంతో వెనుకబడి పోయిందని అనుకునే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పారు. ఆదిశగా ఏపీ కూడా ముందుకు దూసుకుపోయేలా ఉండాలని చెప్పారు. అయితే.. ఏపీకి మంచి భవిష్యత్తు ఉందని.. అయితే.. అది ప్రజల చేతుల్లోనే ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఇంతకు మించి తాను ఏమీ చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం తను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.