వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. వ చ్చే ఎన్నికల్లో దాదాపు ఆయన గెలుపు పక్కా అన్న వాతావరణం ఎన్నికలకు రెండు నెలల ముందే బాపట్లలో కనిపిస్తోంది. ప్రజల మనిషిగా నరేంద్రవర్మ పేరు బాపట్లలో మార్మోగుతోంది. ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంతో ఆయన ప్రజలకు సేవ చేయడంలోనే తపిస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ తిరుగుతూ.. వచ్చే ఎన్నికలలో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
2014 ఎన్నికల తర్వాత నుంచి వేగేశ్న స్థానికంగా అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అప్పటి నుంచే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. తనకు నియోజకవర్గంలో ఏ పదవి లేకపోయినా సొంత ఖర్చుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు టికెట్ ఆశించారు. నిజానికి అప్పట్లో వర్మకు టికెట్ దక్కి ఉంటే జయాపజయాలతో సంబంధం లేకుండా బాపట్లలో టీడీపీ మరింత స్ట్రాంగ్ అయ్యేది.
2019 ఎన్నికల్లో అనూహ్య కారణాలతో ఆయనకు టికెట్ దక్కలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా వర్మ ప్రజలకు చేరువయ్యారు. బాపట్ల ప్రజలకు, పార్టీ కేడర్‌కు అండగా ఉన్నారు. ఎట్టకేలకు ఏడాదిన్నర కిందట.. బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఆయనను నియమించగా పార్టీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ శక్తిగా మార్చేశారు.
బాపట్లలో ప్రస్తుత ట్రెండ్ ఇదీ..
ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గం ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వరుసగా గెలిచిన వైసీపీ నాయకుడు కోన రఘుపతి.. తొలి ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పి.. అబివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత.. ఐదేళ్ల కాలంలో తొలి మూడేళ్లు కరోనా, డిప్యూటీ స్పీకర్.. అంటూ ఎలాంటి కీలక పనులు చేపట్టలేదు. ఫలితంగా నియోజకవర్గంలో సొంత పార్టీ కేడర్ కూడా కోనపై రగిలిపోతోంది. పైగా రెండు సార్లు కోనకు ఇచ్చాం కాబట్టి.. ఇప్పుడు వేరేవారికి ఛాన్స్ ఇవ్వాలనే ఆలొచనలోనూ ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకు తోడు వైసీపీ వ్యతిరేకత బలంగా వీస్తుండడంతో అది కోనకు బాగా మైనస్ అవుతుంది.
గత నెల రోజులుగా వైసీపీ నుంచి కేడర్ టీడీపీలోకి భారీగా జంపింగ్‌లు చేస్తున్నారు. వర్మ నాయకత్వంలో పనిచేయడంపై భరోసా వ్యక్తం చేస్తున్నారు. అల్టిమేట్‌గా టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా వేగేశ్న విజయం నల్లేరుపై నడకే నన్నది పరిశీలకుల అంచనా. ఇక, స్థానికంగా ఎలాంటి అధికారం లేకుండానే వేగేశ్న.. అనేక సేవలు చేసిన దరిమిలా.. ఆయన ఇప్పుడు గెలిస్తే.. తమకు మేలు జరుగుతుందని భావించే వర్గాలు పెరుగుతుండడం గమనార్హం. ఇక నరేంద్రవర్మ కూడా తన ప్రచారంలో ఒక్కసారి ఓటేసి గెలిపించండి మీతో శభాష్ అనిపించుకుంటా అంటూ ఆయన చేస్తోన్న ప్రచారం ప్రజల్లోకి బాగా వెళుతోంది. పైగా సౌమ్యుడు అయిన నరేంద్రవర్మకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న చర్చే ఇప్పుడు బాపట్లలో బలంగా వినిపిస్తోంది.