ఆది నుంచి వైసీపీ కాడి మోసిన కాపు నాయకురాలు.. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మ తాజాగా జగన్‌పై నిప్పులు చెరిగారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాద్యత లేదన్నారు. ప్రభుత్వ పాలనలోనూ జగన్‌కు బాధ్యత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ముందుగా మీడియా ముఖంగా ఆమె చెప్పడం గమనార్హం.
“వైయస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. పార్టీ కోసం తమ జీవితాలు, ప్రాణాలు పణంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు“ అని పద్మ నిప్పులు చెరిగారు.
ఇదేసమయంలో జగన్‌కు బాద్యత లేదన్నారు. “పార్టీని నడిపించడంలో, పరిపాలన చేయడంలో, సమా జం పట్ల అంతకన్నా బాధ్యత లేదు“ అని పద్మ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసినట్టు తెలిపారు.
ఎందుకీ నిర్ణయం!
ఎన్నికల సమయంలోనే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న పద్మ.. తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీనివెనుక.. ఆమె కు టికెట్ ఇస్తున్నట్టు అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి హామీ ఇవ్వడమే కారణం. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభానును వదిలించుకుని..నీకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆయన నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో పద్మ తన పదవిని వదులుకున్నారు. చివరకు ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆ ఆ వేదనతోనే ఇప్పుడు పద్మ రాజీనామా బాటపట్టారు. కాపు కులానికి చెందిన పద్మ… 2012 నుంచి వైసీపీతో కలిసి ఉన్నారు.