దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తీసిన వర్మ ఇటీవల కాలంలో అవుట్ డేటెడ్ డైరెక్టర్ గా మారిపోయారని ఆయన ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా రాజకీయాలలో వేలుపెడుతున్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా నుంచి తెరకెక్కించి బొక్క బోర్లా పడ్డారని విమర్శలు వచ్చాయి. అటువంటి నైజం ఉన్న వర్మ తాజాగా ఏపీ సీఎం జగన్ పై ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్లు రేట్లు పెంపు విషయంలో గతంలో మాజీ మంత్రి నానితో వాడీవేడిగా డిబేట్లు నడిపిన వర్మ ఆ తర్వాత వైసీపీకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయారని తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
ఇక, మెగా ఫ్యామిలీ పై ప్రత్యేకించి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై వర్మ చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై కూడా వర్మ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కత్తిపూడి సభలో పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకున్నాడని సెటైర్లు వేశారు. తన కులం వ్యక్తులు, అభిమానుల గుండెల్లో హీరో నుంచి జీరోకు పవర్ స్టార్ పడిపోయారని ఎద్దేవా చేశారు.
మరోవైపు, వర్మపై ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గార్లపాటి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవి అప్పులలో కూరుకుకపోయారని, వాటిని తీర్చేందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్, జగన్ పై సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు. వర్మ తిక్క తిక్క పనులు చేసి దాదాపు 20 కోట్ల వరకు అప్పులు చేశారని, ఆ టైంలో కొందరు వైసీపీ నాయకులు డబ్బులు ఆఫర్ చేయడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు తీశారని ఆరోపించారు. ఆ డబ్బులకు అలవాటు పడిన వర్మ నిజానిజాలతో సంబంధం లేకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలతో చంద్రబాబు, లోకేష్ ల మీద నెగిటివిటీని ప్రచారం చేశారని ఆరోపించారు.
ఆ సినిమా తీసే సమయంలో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వర్మతో డీల్స్ మాట్లాడుకోవడం తన కళ్ళరా చూశానని, ఇప్పుడు జగన్ పై సినిమా అంటూ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేయబోతున్నారని ఆరోపించారు. ఈసారి చేయబోయే విష ప్రయోగంలో జగన్, భారతీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొడాలి నాని అందరూ ఉంటారని అన్నారు. బయట నుంచి చూసేవాళ్ళు వర్మను పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటారని, దగ్గరగా చూస్తే ఆయన ఒక పిల్ల బోట్ లాగా ప్రవర్తిస్తారని, ఒకప్పటి వర్మ ఇప్పుడు లేరని వెల్లడించారు.