రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుతోనే వివాదాలు సావాసం చేస్తుంటాయి. కావాలని చేసినా…కాంట్రవర్సీ కోసం చేసినా…ఆర్జీవీ కామెంట్లు మాత్రం ఇటు మీడియా, అటు సోషల్ మీడియాలో కాక రేపుతుంటాయి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వర్మ…ప్రత్యేకించి పవన్ పై పని గట్టుకొని మరీ విమర్శలు గుప్పిస్తుంటారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తేసిన వర్మ…మెగా ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్లు చేయడం కలకలం రేపింది.
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే ఒమెగా స్టార్ అనడంపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక, పవన్ కన్నా వెనకొచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారని, పవన్ మాత్రం తెలుగు అంటూ ఇక్కడే వేలాడుతున్నారని వర్మ ఎద్దేవా చేయడం పవన్ ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేశాడు వర్మ. కొత్త మెగా హీరో అల్లు అర్జునే అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టయిందంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఏప్రిల్ 29న విడుదల కాబోతోన్న ఆచార్య చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో చిరు, చెర్రీ సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భంగా డ్యాన్స్ విషయంలో తగ్గను అంటూ చెర్రీ…తగ్గు అంటూ చిరు మాట్లాడుకున్నారు. దీంతో, ఈ వీడియోను ట్వీట్ చేసిన వర్మ..చిరు, చరన్ లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ వీడియో చూసిన తాను మెగా రీతిలో బాధపడ్డానని వర్మ సెటైర్లు వేశారు. “మెగా తండ్రి, మెగా తనయుడు మాట్లాడుకుంటూ తగ్గు, తగ్గను, తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ డైలాగులు ఉపయోగించారు. తద్వారా కొత్త మెగా హీరో అల్లు అర్జునే అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టయింది” అంటూ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వర్మ కామెంట్లపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మరి, ఆ వ్యాఖ్యలపై చిరు, చరణ్ ల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.