టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన లైగర్ భారీ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బొక్క బోర్లా పడింది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కెరీర్ లో కూడా ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కథా, కథనంలో బలం లేకపోవడమే కారణమని సినీ విమర్శకులు కొందరు, ఇండస్ట్రీకి చెందినవారు విమర్శించారు.
అయితే, సినిమా హిట్ కాకపోవడానికి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా లైగర్ ఫ్లాప్ కావడానికి కారణాలను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించారు. ఈ సినిమా ఆడకపోవడానికి విజయ్ దేవరకొండే కారణమని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగానే విజయ్ దేవరకొండ దూకుడు స్వభావి అని, స్టేజి మీదకి ఎక్కిన తర్వాత అందరి ఫోకస్ తనపై ఉండాలి అని కోరుకునే వ్యక్తి అని విమర్శించారు.
వేదికపై ఎక్కిన తర్వాత ప్రేక్షకులను ఆకర్షించేందుకు తనదైన శైలిలో పొగరుగా మాట్లాడడం, సైగలు చేయడం విజయ్ కు అలవాటేనని అన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు తమ వినయం, విధేయత, నడవడికతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని వర్మ కితాబిచ్చాడు. అప్పటిదాకా బాలీవుడ్ తారల అహంకారాన్ని మాత్రమే చూసిన హిందీ ప్రేక్షకులు…దక్షిణాది నటుల వినయపూర్వక, మర్యాదపూర్వక ప్రవర్తనను చూసి అద్భుతంగా ఉందని భావించారని చెప్పారు.
అటువంటి సమయంలో లైగర్ ప్రమోషన్ ఈవెంట్లలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, లాంగ్వేజ్ చూసి షాక్ అయ్యారని చెప్పుకొచ్చారు. తన స్వాభావికమైన పొగరుతో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ లు బాలీవుడ్ ప్రేక్షకులకు రుచించలేదని, అందుకే లైగర్ ను డిజాస్టర్ చేశారని వర్మ అన్నాడు.