జగన్ సీఎం అయిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన నేతలపై అక్రమ కేసులు బనాయించడం, కుదరకుంటే వారి ఇళ్లపై దాడులు చేయించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాక్ష్యాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై గత ఏడాది వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేయడం జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్…జనాన్ని వెంటేసుకొని చంద్రబాబు ఇంటిని ముట్టడించడం సంచలనం రేపింది. అయ్యన్న కామెంట్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేసిన జోగి…అలా చేయకుంటే రాష్ట్రంలో చంద్రబాబును తిరగనివ్వబోమని హెచ్చరించడం పెను దుమారం రేపింది. ప్రతిపక్ష నేతలపై ఓ ఎమ్మెల్యే వీధిరౌడీలా జనాన్ని వేసుకొని వెళ్లి దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతోపాటు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడి ఘటనలు ఏపీలో లా అండ్ ఆర్డర్ ను ప్రశ్నించేలా చేశాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రకారం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య ఓ లేఖ రాశారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయన రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చే నాయకులకు కూడా తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందని, గతంలో పార్టీ కార్యాలయంపై కొందరు దాడి చేశారనిఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి, వర్ల రామయ్య లేఖపై డీజీపీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.