ప్రభుత్వాన్ని విమర్శించారన్న కారణంతో టిడిపి నేత చింతకాయల విజయ్ నివాసంలో ఏపీ సిఐడి పోలీసులు హల్చల్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంటికి వచ్చిన పోలీసులు….విజయ్ లేకపోవడంతో ఆయన పిల్లలను ప్రశ్నించారు. చివరికి ఆ ఇంట్లో పనిమనిషి నోటీసులు ఇచ్చి వెళ్లారు. అంతేకాదు, విజయ్ డ్రైవర్ ని కూడా పోలీసులు కొట్టారని ఆరోపణలు వచ్చాయి.
అయితే, విజయ ఇంట్లోకి రావడమే కాకుండా చిన్నారులను ప్రశ్నించి, వారి ఫోటోలను తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. పోలీసులమని వచ్చిన నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 1న విజయ్ ఇంట్లో ఆయన పిల్లలపై ఆ పోలీసుల వికృత చేష్టలను కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నానని వర్ల రామయ్య అన్నారు.
విజయ్ ఫ్లాట్లోకి బలవంతంగా ప్రవేశించిన నలుగురు… విజయ్ డ్రైవర్ని కొట్టారని, కబోర్డులు తెరిచి వస్తువులను చిందరవందరగా చేశారని ఆరోపించారు. మీ నాన్న ఎక్కడ అంటూ విజయ్ కూతురిని పదేపదే ప్రశ్నించి భయభ్రాంతులకు గురిచేసారని, దాంతో ఐదేళ్ల చిన్నారి తీవ్ర మానసిక వేధింపులకు గురైందని ఆరోపించారు. పిల్లల ఫోటోలను కూడా సిఐడి పోలీసులు తీసుకెళ్లడంపై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలతో అలా ప్రవర్తించిన ఆ నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.