ఏ క్షణంలో అయినా ఎన్నికలు వస్తాయి.. సిద్ధంగా ఉండాలంటూ ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కాలంలో తరచూ చెబుతున్నారు. నిజంగానే ఎన్నికలు వస్తాయా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కారణంగా.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు రెండేళ్ల ముందు నుంచి ఎన్నికల వేడి మొదలైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు ఆశావాహులు తమ రాజకీయ కాంక్షను ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. తాము ఎన్నికల బరిలో నిలవనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
సినీ నటి.. ఒకప్పుడు తన అందాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న వాణీ విశ్వనాథ్.. తన రాజకీయ ఆలోచనల్ని వెల్లడించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. ఒకప్పుడు హాట్ బ్యూటీగా పేరున్న ఆర్కే రోజా వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నగరి నుంచే వాణీ విశ్వనాథ్ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో.. నగరి మీద ఇప్పుడు అందరి చూపు పడనుంది.
సినీ రంగానికి చెందిన ఇద్దరు నటీమణులు.. పోటీకి దిగటం ఆసక్తికకరమే కాదు.. చాలా అరుదుగా అభిప్రాయపడుతున్నారు. వాణీ విశ్వనాథ్ తాజాగా మాట్లాడుతూ.. తాను చిత్తూరుజిల్లా నగరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రశ్నిస్తే.. ఇంకా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న దానిపై తాను నిర్ణయం తీసుకోలేదన్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పటం గమనార్హం.
పార్టీ నుంచే కాదు.. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీలో ఉండటం ఖాయమని చెప్పటం విశేషం. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పని చేసిందని.. అందుకు తాను ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు.
రోజా అడ్డా అయిన నగరిలోకి వాణీ విశ్వనాథ్ ఎంట్రీ ఇవ్వటం.. ఈసారి ఈ ఇద్దరు సినీనటీమణుల మధ్య పోటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరిని ఆకర్షిస్తుందని చెప్పాలి. రోజాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో విరుచుకుపడే వాణీ విశ్వనాథ్ కారణంగా.. వాతావరణం మరింత వేడిగా మారటం ఖాయమంటున్నారు.