రాష్ట్రంలో గత రెండు మూడు రోజులు.. వంగవీటి మోహన్రంగా కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. ఆయన ఎవరి వాడు.. అనేది తేలకపోయినా.. ఆయనను మావాడంటే మావాడనే విధంగా టీడీపీ, వైసీపీ నాయకు లు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. కాపుల రిజర్వేషన్ కాలరాసి.. రంగా ఆశయానికి గండికొట్టారని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇక, రంగాను హత్య చేసి.. ఆయన విగ్రహానికి పూల మాల వేస్తున్నారని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు.
మొత్తంగా ఈ వివాదం అంతా కూడా వంగవీటి వారసుడు రాధా కోసమేననే వాదన అందరికీ తెలిసిందే. అయితే.. రంగా విగ్రహావిష్కరణ (వర్ధంతికి ముందు రోజు రాత్రి)లో వైసీపీ నాయకులు కొడాలి నాని, వైసీపీ మద్దతుదారు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో రాధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని టీడీపీపై విమర్శలు చేసినా.. ఆయన పట్టించుకోలేదు. చూస్తూ.. కూర్చున్నారు. పోనీ.. రంగా విగ్రహావిష్కరణను రాజకీయం చేయొద్దని కూడా ఆయన చెప్పలేదు.
ఇక, తెల్లవారి.. రంగా విగ్రహావిష్కరణలో టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత్రం రాధామౌనంగా ఉండలేదు. రంగాను టీడీపీ చంపలేదని తీర్మానం చేశారు. కట్ చేస్తే.. ఈ పరిణామాల అనంతరం.. తూర్పు గోదావరిలో కాపు నాయకులు రహస్యంగా భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది? అనే విషయంపై వారు చర్చించారు.
ఈ క్రమంలో చాలా మంది రాధాను ఆటలో అరటి పండుగా మారిపోయారని.. ఆయన ఏదో ఒక స్టాండు తీసుకుని ఉంటే వివాదం ఉండదని.. అనేశారు. ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు? ఏ పార్టీకి మద్దతుగా ఉన్నట్టు? అని నాయకులు ప్రశ్నించారు. అయితే.. ఎవరూ కూడా ఆయనను సమర్థించకపోవడం గమనార్హం. రంగాకు అనుకూలంగా ఉండాలని మాత్రమే తీర్మానం చేసుకున్నారు. ఇదీ సంగతి..!