గత ఐదేళ్లు వైసీపీ నేతలు ఎంతలా ప్రలోభ పెట్టినా వెనకడుగు వేయకుండా కూటమి గెలుపు కోసం నడుం బిగించిన నేతల్లో వంగవీటి రాధా ఒకరు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ కావడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పై హామీ రావడంతో వంగవీటి రాధా వైసీపీని వీడి పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ గెలుపుకు కృషి చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేయడంతో.. వంగవీటికి ఇచ్చిన హామీ అమలు కాలేదు.
2024 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీ వీడి వైసీపీలో చేరడం ఖాయమని బలంగా ప్రచారం జరిగింది. కానీ వంగవీటి మాత్రం టీడీపీ వీడలేదు. తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన నిరాశే ఎదురైంది. అయితే భవిష్యత్తులో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి హామీని టీడీపీ నాయకత్వం నుంచి పొందడంతో ఆయన కూటమి గెలుపుకు మద్దతుగా నిలిచారు. విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
తన త్యాగానికి తగిన గుర్తింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాధాకు రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఛాన్స్ దక్కలేదు. మంత్రివర్గంలో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని వంగవీటి రాధాకు ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ హోదా కట్టబెడుతున్నారు. ఇదే తరుణంలో పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన రాధాకు కూడా సముచిత స్థానం కల్పించేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారట.
అందులో భాగంగానే మంగళవారం సచివాలయానికి వంగవీటి రాధాను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. 2025 మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తామని రాధాకు సీఎం గ్యారెంటీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి ఐకాన్‌గా ఉన్న వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి.. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.