టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. పాదయాత్రలో లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. యువతీయువకులు లోకేష్ వెంట నడిచేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగానే పీలేరులో ఆసక్తికర ఘటన జరిగింది. లోకేష్ పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొని సర్ ప్రైజ్ చేశారు.
పాదయాత్రకు రాధా తన సంఘీభావం తెలిపారు. అంతేకాదు, లోకేష్ అడుగులో అడుగు వేసి పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ వెంట నడుస్తున్న సందర్భంగా రాధా పలు విషయాలను ఆయనతో చర్చించారు. టీడీపీ నేత అయిన రాధా పార్టీ మారబోతున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, తాజాగా లోకేష్ పాదయాత్రలో రాధా పాల్గొనడంతో ఆ పుకార్లన్నీ పటాపంచలయ్యాయి.
మరోవైపు, కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం దగ్గర ముస్లిం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. గతంలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉన్న సందర్భంలోనూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదని లోకేష్ గుర్తు చేశారు. మైనార్టీల్లో పేదరికం నిర్మూలించాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని లోకేష్ గుర్తు చేశారు. మైనార్టీ కార్పొరేషన్‌ను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేశారని, డిప్యూటీ సీఎంగా అంజాద్ బాషా కూడా మైనార్టీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.