ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనలో కూటమి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన వంగలపూడి అనిత.. జగన్ ను ఏకిపారేశారు.
మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతున్నాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తున్నాడని జగన్ పై అనిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరగకపోతే వారి తరఫున తాను ధర్నా చేస్తానని జగన్ అంటున్నారు.. మరి బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై ఆయన ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు.
వైకాపా హయాంలో ఎల్జి పాలిమర్స్ ఘటం జరిగినప్పుడు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు మృతులకు ఇంతవరకు చెల్లిగవ్వ కూడా అందలేదు. ఆ నాడు పాలిమర్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ. 10 వేలు ఇస్తామని చెప్పిన జగన్ ప్రస్తుతం పరిహారం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అనిత అన్నారు.
అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యేకు బాగా అలవాటు అయిపోయిందని.. ఎల్జి పాలిమర్స్ వద్ద వైసీపీ ప్రభుత్వం దోచుకున్న రూ.150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎస్సెన్షియా ఫార్మా ప్రమాద ఘటన లో మృతి చెందిన 17 మంది కుటుంబాలకు, 36 మందికి క్షతగాత్రులకు డబ్బులు పంపడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి అనిత వెల్లడించారు.