వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాధవ్ డర్టీ పిక్చర్ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్లకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు జస్బీర్ సింగ్ గిల్ ఫిర్యాదు చేశారు. మాధవ్ వీడియో వ్యవహారం ఎంపీలకు మాయని మచ్చగా ఉందని అన్నారు. ఈ వీడియోపై తక్షణమే దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాగా, మాధవ్ ను కాపాడేందుకు పోలీస్ వ్యవస్థతో అసత్యాలు చెప్పించే పరిస్థితికి వచ్చారని టీడీపీ నేత వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. వీడియోలో ఉన్నది గోరంట్ల కాదని ఎస్పీ ఫకీరప్ప స్పష్టంగా చెప్పలేదని, రికార్డింగ్ చేసిన వీడియో తీసుకురావాలని ఎస్పీ చెబుతున్నారని అన్నారు. గోరంట్ల ఫోన్ లోనే ఒరిజినల్ వీడియో ఉండి ఉంటుందని, గోరంట్ల మాధవ్ ఫోన్ ను ఎస్పీ ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాధవ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులే బకరాలు అవుతున్నారని, వారే బలవుతున్నారని అనిత అన్నారు. మాధవ్ ను రక్షించేందుకు ఐపీఎస్ ఫకీరప్పతో అబద్ధాలు చెప్పించి క్లీన్ చిట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్మాదులకు, పిచ్చి వారికి లాజిక్కులుండవని, వారే ఈ తరహా స్టేట్ మెంట్లు ఇస్తుంటారని అన్నారు. అక్కచెల్లెమ్మల ఓట్లతో గెలిచిన జగన్ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
మాధవ్‌ను ఎలాగైనా కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ వ్యవహారంపై గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామన్నారు. గోరంట్ల మాధవ్‌ను బర్తరఫ్ చేసేవరకు తమ పోరాటం ఆగదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.