టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై పరోక్ష వైసీపీ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. పట్టాభితోపాటు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిపై కూడా వంశీ కోర్టును ఆశ్రయించారు. సంకత్ప సిద్ధి స్కామ్ లో తనతో పాటు మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం దారుణమని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంకల్ప సిద్ధి కేసులో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
అయినా సరే ఇష్టానుసారంగా టీడీపీ నేతలు తమ పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఆయన కోర్టును ఆశ్రయించారు. సంకల్ప సిద్ధి కేసులో డబ్బులు పోగేసుకుని నానితో కలిసి తాను బెంగళూరులో ఆస్తులు కొనుక్కున్నట్టుగా అసత్య ఆరోపణలు చేశారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని వంశీ డిమాండ్ చేశారు.
రాజకీయం చేయడం కోసమే తమపై నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై న్యాయం కోసం కోర్టు తలుపు తట్టానని అన్నారు. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, ఈ కేసులో టీడీపీ నేతలకు తప్పకుండా శిక్ష పడుతుందని వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా సహాయంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ అనే బినామీలు సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆ కంపెనీ దాదాపు రూ.1100 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిందని టీడీపీ నేత పట్టాభి కొద్ది రోజుల క్రితం ఆరోపించారు.
రూ. 20 వేలు కడితే 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని నమ్మబలికి జనాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వంశీ 3 నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సంకల్ప సిద్ధి సంస్థ డైరెక్టర్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు సంస్థ ఎండీ వేణుగోపాల్, డైరెక్టర్ కిశోర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో, సంకల్ప సిద్ధి వ్యవహారంలో తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర డీజీపీకి గతంలో వంశీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా పట్టాభి, అర్జునుడులపై పరువు నష్టం దావా వేశారు.