మన దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో కోరలు చాస్తుండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో కీలకంగా మారింది. కొన్ని దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే కాలేజీల్లోకి అనుమతించే దిశగా తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇలా, అనేక చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే అనుమతినిస్తున్నారు.
అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా ఇదే తరహాలో వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఓ చోటికి అనుమతిస్తామంటోది అక్కడి సర్కార్. అయితే, అదే కాలేజో, మరో కీలక ప్రదేశమో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇకపై, వ్యాక్సిన్ వేయించుకున్న వారికే మద్యం అమ్మాలని నీలగిరి జిల్లా అధికారులు నిర్ణయించడం సంచలనం రేపింది. ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపిస్తేనే మద్యం కొనే అవకాశముంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి.
మందు బాబుల కిక్కు దిగేలా స్టాలిన్ సర్కార్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరోనాను కట్డడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నీలగిరి జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలవుతున్న ఈ షాకింగ్ పైలట్ ప్రాజెక్టును త్వరలోనే తమిళనాడులోని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలన్న యోచనలో సీఎం స్టాలిన్ ఉన్నారట. దీంతో, మందుబాబులంతా వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారట.
నీలగిరి జిల్లాలో 76 మద్యం షాపుల్లో రోజూ రూ.కోటి విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. అక్కడ 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా ఇప్పటికే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆ మిగతా 30 శాతం జనం కూడా వ్యాక్సిన్ వేయించుకోలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దాంతోపాటు కరోనా కట్టడికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి, పొరుగు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే మందుబాబులకు చిక్కులు తప్పేలా లేవు.