భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ వంటి అతి పెద్ద దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మన దేశంలోనే కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి అవుతున్నాయి.
అయినప్పటికీ.. వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది. నెలవారీగా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల డోసులు కాగా…ఈ లెక్కన వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే మరో ఏడాదికి పైగా పట్టే అవకాశముంది. దీంతో, వ్యాక్సినేషన్ పై కేంద్రానిని ముందుచూపు లేని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు.
దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రకటించారు. వ్యాక్సినేషన్ పై రాహుల్ గాంధీ ఆందోళన చెందుతున్నారని, ముందు రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ పై దృష్టిపెడితే బాగుంటుదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గందరగోళంగా సాగుతోందని, 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను కూడా వాళ్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. అంతకుముందు, రాష్ట్రాల వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం తప్పుబట్టింది. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృధా చేస్తున్నాయని ఆరోపించింది.