టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. స్టూడెంట్ నెం.1తో మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు ప్లాప్ అంటూ లేకుండా వరుస హిట్ లతో దూసుకుపోతున్న రాజమౌళి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు శిష్యుడిగా చెప్పుకునే రాజమౌళి…తన ప్రతి విజయం వెనుక తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని చెబుతుంటారు. తన తండ్రి అందించిన కథలకు అద్భుతంగా తెరకెక్కించే రాజమౌళి….ఆర్ఆర్ఆర్ తో మరోసారి తమ కాంబినేషన్ ఎంత సక్సెస్ ఫుల్లో చెప్పేశారు.
బాహుబలి తరహాలోనే ఈ చిత్రానికి పార్ట్ 2 కావాలని చెర్రీ, తారక్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఒక సినిమా చూపిస్తే ఎలా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర సక్సెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు ఇచ్చిన పార్టీ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై సినీ రచయిత విజయేంద్రప్రసాద్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
దేవుడి దయ ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ రావచ్చని చిత్రం విడుదలకు ముందు చెప్పిన విజయేంద్ర ప్రసాద్…నిన్న రాత్రి పార్టీ సందర్భంగా పూర్తి క్లారిటీనిచ్చారు. ఈ చిత్రానికి సీక్వెల్ తప్పక ఉంటుందని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన కథను సిద్ధం చేయబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా వి.విజయేంద్రప్రసాద్ చెప్పిన తీపి కబురుతో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి, తన తండ్రి చెప్పిన విషయంపై రాజమౌళి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటన చేస్తారు? ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.