పేరుకు అగ్రరాజ్యమనే కానీ.. ఆ దేశంలోని పలువురి బుద్ధి మాత్రం అగ్రరాజ్యం స్థాయిలో ఉండదు. కానీ.. అగ్రరాజ్యానికి చెందిన వాళ్ల అహంకారం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు వారి తీరుతో కోట్లాది మంది మనసుల్ని గాయపరుస్తుంటాయి. అయితే.. ఇక్కడో విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇలాంటి బలుపు చేష్టలకు పాల్పడిన వారిని సదరు అగ్రరాజ్యం న్యాయంగా శిక్షించే తీరు మాత్రం అగ్రరాజ్యం స్థాయిలోనే ఉంటుందని చెప్పాలి.
గత ఏడాది మొదట్లో అమెరికాలో మన తెలుగమ్మాయి జాహ్నవి కందుల ను కారుతో ఓ పోలీసు అధికారి గుద్దేసిన సంగతి తెలిసిందే.
గుద్దేయటమే కాదు.. ఆమె మరణాన్ని చులకన చేసేలా మాట్లాడిన అమెరికా పోలీసు అధికారి మాటలు అప్పట్లో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాజమౌళి తీసిని ఆర్ఆర్ఆర్ మూవీలోని సీన్ ను గుర్తుకు తెచ్చేలా సదరు పోలీసు అధికారి మాటలు ఉన్నట్లుగా పలువురు పేర్కొనటం తెలిసిందే. తాజాగా ఆ పోలీసు అధికారిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అంతేకాదు.. అతడి మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సియాటెల్ పోలీసు శాఖ చీఫ్ సూరహర్ పేర్కొనటం గమనార్హం.
ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. 2023 జనవరిలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవిని సియాటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని అక్కడికక్కడే మరణించింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో బయటకు రావటంతో ఈ తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
‘‘ఆమె ఒక మామూలు వ్యక్తి. ఆమె మరణానికి ఎలాంటి వాల్యూ లేదు’’ అన్న అర్థం వచ్చేలా సదరు పోలీసు అధికారి వ్యాఖ్యానించాడు. ఈ వీడియో పెను దుమారాన్ని రేపటమే కాదు.. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక దశలో అగ్రరాజ్యం సైతం ఆత్మరక్షణలో పడింది. ఈ అంశంపై స్పందించిన భారత ప్రభుత్వం.. తక్కువ చేసి మాట్లాడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అప్పట్లో ఆ అధికారిపై సస్పెండ్ చేశారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణ కొలిక్కి రావటమే కాదు.. బలుపు వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిని జాబ్ నుంచి తీసేశారు.
అధికారిమాట్లాడిన వ్యాఖ్యలు బాధితురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చినట్లుగా పేర్కొన్నారు. వాటిని ఎవరూ మాన్పలేరన్న పోలీసు అధికారి రహర్.. ‘‘ఈ వ్యాఖ్యలు పోలీస్ డిపార్టుమెంట్ కు మాయని మచ్చగా మారాయి. పోలీసు శాఖకే సిగ్గుచేటు. ఈ ఉదంతం తర్వాత పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయి. ప్రజల విశ్వాసాన్ని పొందటం పోలీసుల బాధ్యత. ఉన్నత ప్రమాణాల్ని పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే అడెరెర్ ను ఉద్యోగం నుంచి తొలగించాం’’ అంటూ వ్యాఖ్యానించారు.