మీరేం తప్పు చదవలేదు. మేం తప్పు రాయలేదు. ఇప్పుడు చెప్పే యువకుడు రోటీన్ కు కాస్త భిన్నమైనవాడు. ఆ మాటకు వస్తే ఇతగాడు చేసే పనిని చాలామంది హర్షించరు కాదు కదా.. తెలుసుకునేందుకు సైతం చిరాకు పడతారు. కానీ.. అతను మాత్రం అలాంటిదేమీ పట్టించుకోడు. రోటీన్ కు భిన్నమనే మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తాడు ఈ 30 ఏళ్ల కాలిఫోర్నియా యువకుడు కైల్ గార్డీ.
వీర్యదాతగా తన గురించి తాను చెప్పుకోవటానికి ఎంతమాత్రం సిగ్గపడని ఇతగాడు.. తాను ధరించే టీషర్టులో కానీ.. తన ఇన్ స్టా పేజీలో కానీ తన గురించి.. తన ప్రొఫెషన్ గురించి ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. తాను చేసే ప్రతి పనిని నిజాయితీగా.. నిర్మొహమాటంగా తెలిపేందుకు అతను అస్సలు ఇబ్బంది పడరు. 30 ఏళ్ల వయసులో తన వీర్య దానంతో అతను 47 మంది పిల్లలకు బయలాజికల్ తండ్రిగా వ్యవహరిస్తున్నాడు.
మిగిలిన వీర్యదాతల మాదిరి తన ఐడెంటిటీని దాచుకోవటం.. రహస్యంగా ఉంచుకోవటం ఇతనికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదు.. వీర్యదాతలు చాలామంది తమ వీర్యం కారణంగా తల్లులైన వారిని.. వారికి పుట్టిన పిల్లల్ని కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ.. కైల్ మాత్రం భిన్నం. తన ఇన్ స్టా అకౌంట్ లో కొద్ది మంది పిల్లలు (తన ద్వారా పుట్టిన) ఫోటోల్ని షేర్ చేశారు. అంతేకాదు.. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని కలుసుకునేందుక టూర్ చేస్తున్నారు కూడా.
త్వరలో మరో 10 మంది చిన్నారులకు కైల్ తండ్రి కాబోతున్నారు. వీర్యదాతగా ఉండటంలో తనకు ఎలాంటి విచారం లేదని తేల్చిన అతను.. తనకు ఎదురయ్యే ఇక్కట్లను ఏకరువు పెడుతున్నారు. తానుచేస్తున్న వీర్యదాత ప్రొఫెషన్ తో డేటింగ్ జీవితాన్ని తాను కొనసాగించలేకపోతున్నట్లుగా వాపోయాడు.
తన ఇన్ స్టా అకౌంట్ కు బోలెడంతమంది అమ్మాయిలు తనను కాంటాక్టు చేస్తుంటారన్న.. అతను తనతో డేటింగ్ చేసే విషయంలో మాత్రం వారు పెద్ద ఆసక్తి చూపించరని వాపోయాడు. తన జీవిత భాగస్వామిని గుర్తించే విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పిన తను.. చాలా మంది మహిళలు తనను కేవలం సంతానం కోసమే సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను సంప్రదించే వారిలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తులో బయలాజికల్ తండ్రి ఎవరో చెప్పాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.
తనను సంప్రదించే మహిళల్లో చాలామందికి డబ్బులు బాగా ఉండటంతో పాటు.. వారు స్పెర్మ్ బ్యాంకులను సంప్రదించొచ్చు. కానీ.. వారు మాత్రం తన వీర్యం కోసం సంప్రదిస్తున్నారని..అందుకు వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం వీర్య దానం కోసం ప్రపంచ పర్యటనలో ఉన్న అతను.. రానున్న రోజుల్లో మరో పది మంది పిల్లలకు బయలాజికల్ తండ్రిని కాబోతున్నట్లు చెప్పారు. చిన్న వయసులోనే అంతమంది పిల్లలకు బయలాజికల్ తండ్రి అయిన కైల్ నిజ జీవితంలో ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ మాత్రం లేకపోవటం విశేషమే. త్వరలో తన ఆశ నెరవేరుతుందని చెబుతున్నాడు.