అయిదు రాష్ట్రాల ఎన్నికలతో దేశంలో రాజకీయ వేడి పుట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా దాన్ని ఈ ఎన్నికలతో ముడి పెట్టి చూడాల్సిన పరిస్థితులు కలిగాయి. అధికారం కోసం పార్టీలు ఆడుతున్న నాటకాలే ఇవన్నీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ మరోస్థాయికి చేరింది. అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానంగా అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శాయాశక్తులా శ్రమిస్తున్నాయి.
వరుసగా మూడో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే యూపీలో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి అవసరం. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ పార్టీకి విజయం చావోరేవోగా మారింది. అందుకే ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం బతిమాలడంతో పాటు బెదిరించేందుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని బుల్డోజర్లు అన్నింటినీ రిపేర్కు పంపించామని మార్చి 10 తర్వాత అవన్నీ పని చేస్తాయని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. రాష్ట్రంలోని నేరగాళ్లపై తమ ప్రభుత్వం అనుసరించే వైఖరి గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బుల్డోజర్లకు పని చెబుతారా? అని సమాజ్వాదీ పార్టీ నేత అడిగిన ప్రశ్నకు ఇలా జవాబు ఇచ్చినట్లు యోగి తెలిపారు. అక్రమ ఆస్తుల విధ్వంసానికి తమ ప్రభుత్వం బుల్డోజర్లను వాడుతుందని చెప్పారు.
అయితే ఇప్పటికే యూపీలో యోగికి ఓట్లు వేయకపోతే వాళ్లను గుర్తించి బుల్డోజర్లతో తొక్కిస్తారని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీకి ఓట్లు వేయని ప్రజల ఇళ్లను గుర్తించి బుల్డోజర్లతో తొక్కిస్తామని ఆయన అన్నారు. అందు కోసం యోగి ఇప్పటికే బుల్డోజర్లు, జేసీబీలను తెప్పిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యోగి బుల్డోజర్ల గురించి మాట్లాడడం గమనార్హం. దీంతో ప్రతిపక్షాలు బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బెదిరించి ఓట్లు వేయించుకోవాలని బీజేపీ చూస్తోందని, కానీ అది సాధ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.