దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులని తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసేందుకు ముస్లిం సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాయర్ జఫర్యబ్ జిలానీ అన్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలను సీబీఐ కోర్టు విస్మరించిందని, నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిందని తెలిపారు. ఈ తీర్పును తప్పు బట్టిన జిలానీ…తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు.
ఈ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందని వ్యాఖ్యానించిన ఒవైసీ….న్యాయ వ్యవస్థ తీర్పులపై, ప్రభుత్వంపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
1992 డిసెంబరు 6వ తేదీన జరిగిన బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు బీజేపీ మహిళా నేత ఉమాభారతి, బీజేపీ నేత కల్యాణ్ సింగ్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసును కొట్టివేసింది.
మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని..అది క్షణికావేశంలో జరిగిందని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించింది. ఈ కేసులో సరైన సాక్షాధారాలు లేవని కేసు కొట్టేసింది.
ఈ కేసులో మొత్తం 49 మంది మీద అభియోగాలు నమోదుకాగా.. ఇందులో 17 మంది మరణించారు. మిగతా 32 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ తీర్పును బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు స్వాగతించారు.