రాజకీయాల్లో వ్యూహాలు భిన్నంగా ఉంటాయని తెలుసు. ఎత్తుకు పైఎత్తు వేస్తారని కూడా తెలుసు.. కానీ. పగ నటిస్తూనే.. విమర్శలు సంధిస్తూనే.. వాటిని అడ్డు పెట్టుకుని.. ప్రేమ కురిపించడం, నోటితో విమర్శిస్తూనే నొసటితో సానుకూల సైగలు చేయడం అనేక కొత్త రాజకీయాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెరదీశారా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి.
రాజమండ్రి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి.. మేధావిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు ఒకింత రేటింగ్ ఎక్కువే. రాజకీయ, ఇతరవర్గాల్లో ఆయన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తూనే ఉంటారు. మాహిష్మతి సింహాసనపు బానిసగా కట్టప్ప ఎంత భక్తితో ఆ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారో… అచ్చం అలాగే జగన్ రాజ్యాన్ని ఉండవల్లి కాపాడుకుంటూ వస్తున్నారు. జగన్ ఎపుడు ప్రమాదంలో పడినా ఉండవల్లి తెరపైకి వచ్చేస్తారు. ఆ కట్టప్పకి, ఈ ఉండవల్లికి తేడా ఏంటంటే… ఒకరిది ప్రత్యక్షం, ఇంకొకరిది గూడుపుఠానీ.
దీంతో ఉండవల్లి ప్రెస్మీట్లకు మంచి వ్యూస్ వస్తుంటాయి. నిజాన్ని నిర్భయంగా.. సుత్తిలేని సూటి విమ ర్శలతో ఉండవల్లి చేసే ప్రసంగాలకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే, తాజాగా ఆయన రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన తీరు.. చేసిన కామెంట్లు.. విన్నవారికి.. చూసిన వారికి కూడా ఏదో తేడా కొడుతోందనే భావన కనిపిస్తోంది. అదేంటో చర్చించుకునే ముందు.. ఉండవల్లి స్వామి భక్తి గురించి.. రెండు లైన్లు చెప్పుకొందాం. రాజకీయంగా ఆయన అమితంగా ప్రేమించేది దివంగత వైఎస్‌ను. ఇప్పటికీ.. వైఎస్‌ను ఉండవల్లి ప్రతిసారీ తలుస్తూనే ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా.. వైఎస్ పాలన గురించి.. ఆయన వ్యవహార శైలి గురించి చెబుతూనే ఉంటారు.
అంత స్వామి భక్తి పరాయణుడైన ఉండవల్లి.. ఇప్పుడు ఒక్కసారిగా జగన్‌పై విమర్శలు సంధించడం.. పోలవరం విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ఓ వర్గం ప్రజలకు విస్మయాన్ని కలిగించాయి. ఇలా జరిగే అవకాశం లేదే! అని చెవులు కొరుక్కుంటున్నారు. అవును! ఉండవల్లి వ్యాఖ్యల అంతరార్థం గమనిస్తే.. మీరు కూడా “అమ్మ ఉండవల్లీ.. ఇంత మీనింగ్ ఉందా!!“ అని నోరెళ్లబెట్టక మానరు. ఒకవైపు విమర్శిస్తున్నట్టుఉన్నా.. మరోవైపు.. జగన్‌కు ఆయన కొండంత అండగా నిలిచారనేది ఆయన వ్యాఖ్యల అంతరార్థం స్పష్టం చేస్తోంది. “కేసులు ఉన్నాయి కాబట్టే.. జగన్ కేంద్రం ముందు లొంగిపోయారనే వాదన ప్రచారంలో ఉంది. కేసులుంటే ఏమవుతుంది..? ఇప్పటికిప్పుడు జైలుకు పంపేస్తారా? పైకోర్టులు లేవా? హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అప్పీల్ చేసుకోలేరా? ఇప్పుడు శిక్ష పడినా .. తెల్లారి .. పైకోర్టు బెయిల్ ఇవ్వదా!!“
అని చేసిన వ్యాఖ్యవెనుక.. వైసీపీలో ఇప్పటి వరకు ఉన్న నైరాశ్యాన్ని.. ఒకవిధమైన భయాన్ని ఉండవల్లి పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు. నిజమే! తమ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమని.. ఇటీవల సీబీఐ కోర్టులో ప్రారంభమైన విచారణ తర్వాత వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు పైకి విమర్శిస్తూనే ఉండవల్లి పరోక్షంగా వైసీపీ నేతలకు ఆక్సిజన్ ఇచ్చేశారు. ఇక, పోలవరం విషయాన్ని కూడా పరోక్షంగా జగన్‌కు మేలు చేసే వస్తువుగా చెప్పుకొచ్చారు. “చంద్రబాబు తప్పులు ఎత్తి చూపుతున్నారు. కానీ.. అధికారం ఇచ్చింది అందుకు కాదుగా!!“ అన్నారు ఉండవల్లి. నిజానికి ఈ మాట చెప్పడం వెనుక వైసీపీ పట్ల ఆయనకు ఉన్న మమకారం.. ఎంతటిదో.. ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్ధమవుతోంది.
నిజానికి ప్రస్తుతం.. జగన్ ఉన్న పరిస్థితిలో.. మోడీని ఎదిరించడం సాధ్యం కాదని స్థానిక నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలోనూ పైకి విమర్శలు చేస్తున్నట్టే నటించేసిన.. ఉండవల్లి.. ఎదిరిస్తే.. మోడీ ఏం పీకుతాడు! అనే సూచనలు సలహాలు బాగానే ఇచ్చేశారు. ఇక, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో జగన్ రాజీపడుతున్నారనే విమర్శలు ఇటీవల కాలంలో జోరుగా సాగుతున్నాయి. వీటిపై సొంత పార్టీలోనూ అంతర్మథనం మొదలైంది. దీనికి విరుగుడు ఏంటి? అని వారు తర్జన భర్జన పడుతున్నారు.
కానీ, తాను వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. వైసీపీపై విమర్శలు చేస్తున్నానన్న మిషతో.. ఉండవల్లి ఈవిషయంలోనూ జగన్‌కు చక్కని సలహాలు రువ్వారు. “రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కేసీఆర్‌ను ఉదాహరణగా తీసుకో. ఎదిరించు. అప్పుడు నువ్వు అరెస్టయినా.. సింపతీ వచ్చేస్తుంది. నువ్వు ఎవరిని సీఎంగా కూర్చోబెడితే.. వారే సీఎం. అంతా నీదే పాలన“ అన్నారు. ఇది విన్నవారు.. ఏమనుకోవాలి.. ఉండవల్లి విమర్శిస్తున్నారంటే.. నమ్మగలరా? కానీ.. ఆయన దృష్టిలో ఇవన్నీ విమర్శలే.. కానీ.. దీనిని కొంచెం ఆలోచనాత్మకంగా చూస్తే.. వైసీపీకి కరడు గట్టిన కార్యకర్తగా ఉండవల్లి వ్యవహరించారనే వాస్తవం బోధపడుతుంది. ఎంతైనా.. తన రాజకీయ నేస్తం వైఎస్ కుమారుడి సర్కారు కదా.. విమర్శలు చేస్తూనే.. సలహాలు.. సూచనలు విసిరేశారన్న మాట. దటీజ్ ఉండవల్లి పాలిటిక్స్!! అందుకే.. అమ్మ ఉండవల్లీ!అనే కామెంట్లు కురుస్తున్నాయి.