గడచిన నూరు రోజులుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రెండువైపులా భారీ నష్టం జరిగింది. కాకపోతే ఉక్రెయిన్ కు ఎంత నష్టం ? రష్యాకు జరిగిన నష్టమెంత ? అన్నదే కీలకమైన పాయింట్. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు దేశాలకు అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. అయితే ఏ దేశం కూడా నూరుశాతం తమకు జరిగిన నష్టాలను స్పష్టంగా ప్రకటించటంలేదు.
అందుకనే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్లో సుమారు 38 వేల భవనాలు నాశనమైపోయాయి. భవనాలు నేలమట్టమవ్వటం వల్ల 2.28 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2 వేల విద్యాలయాలు ధ్వంసమైపోయాయి. 50 రైలు వంతెనలు, 500 కర్మాగారాలు, 500 ఆసుపత్రులు పూర్తిగా దెబ్బతినేశాయి. సైనికులు, మామూలు జనాలు కలిపి సుమారు 50 వేల మంది చనిపోయారని అంచనా. ఇదే సమయంలో 2 లక్షలకు పైగా తీవ్రంగా గాయపడ్డారట.
మొత్తం మీద ఉక్రెయిన్ కు జరిగిన ఆస్తినష్టం సుమారు 600 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఇదే సమయంలో రష్యా బయటకు చెప్పకపోయినా సుమారు 30 వేల మంది సైనికులు చనిపోయినట్లు సమాచారం. మరో 5 వేల మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారట. 100 రోజులుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆక్రమించింది కేవలం 20 శాతం మాత్రమే. కాకపోతే బయట ప్రపంచంతో ఉక్రెయిన్ వ్యాపార సంబంధాలు జరిపే నౌకాశ్రయాలన్నింటినీ రష్యా స్వాధీనం చేసుకుంది.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం, వీటికి జరిగే నష్టాలను పక్కన పెట్టేస్తే యుద్ధం వల్ల మిగిలిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉక్రెయిన్ ప్రధానంగా వ్యవసాయాధార దేశం. యుద్ధం కారణంగా 22 మిలియన్ టన్నుల ఆహారోత్పత్తులు ఎగుమతులు అవలేదు. ఉక్రెయిన్ నుండి విదేశాలకు ప్రధానంగా సన్ ఫ్లవర్, గోధుమలు, సోయాబీన్స్ తో పాటు బొగ్గు ఎగుమతవుతుంటుంది. ఇపుడు వీటికి అడ్డంకులు రావటంతో శ్రీలంక, ఇండియా, పాకిస్ధాన్ తో పాటు చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు, గోధుమలు ఆగిపోవటంతో సుమారు 20 దేశాలు అవస్థలు పడుతున్నాయి.