ప్రపంచానికి కొత్త భయంగా మారిన యూకే వైరస్.. తాజాగా భారత్ కు వచ్చేసింది. యూకే నుంచి.. యూకే సరిహద్దు దేశాల నుంచి వచ్చే విమానాలపై బ్యాన్ విధించటమే కాదు.. అక్కడ నుంచి వచ్చిన వారిని జల్లెడ వేసి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంత భారీగా కసరత్తు చేసిన పిమ్మట.. దేశ వ్యాప్తంగా ఆరేడుగురికి కొత్త వైరస్ వచ్చిందని తేల్చారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి యూకే వైరస్ ఉందన్న విషయాన్ని తేల్చేశారు. దీంతో తెలంగాణ వాసులకు షాకింగ్ గా మారింది.
ఈ ఏడాది మొదట్లో కరోనా వ్యాప్తి సందర్భంలోనూ.. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసు తెలంగాణలోనే నమోదైంది. తాజాగా కొత్త స్ట్రెయిన్ సైతం తెలంగాణలోనే గుర్తించారు. దీంతో.. ఏపీలోని ప్రజలు కాస్తంత రిలీఫ్ గా ఫీలయ్యారు. ప్రస్తుతానికైతే.. ముప్పు లేదన్న వాదన పలువురి నోటి నుంచి వినిపించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త వైరస్ తమ వరకు రాలేదన్న భరోసాతో ఉన్నారు.
వారి ఆనందం రోజులో ఆవిరి అయ్యే మాటను సీసీఎంబీ వెల్లడించింది. తాజాగా ఏపీలోనూ కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. రాజమహేంద్రవరానికి చెందిన మహిళ ఒకరు పది రోజుల క్రితం తన కుమారుడితో సహా యూకే నుంచి వచ్చారు. వారందరికి పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు మినహా.. మిగిలిన వారందరికి నెగిటివ్ వచ్చాయి.
ఆమె నుంచి మిగిలిన వారెవరికి స్ట్రెయిన్ వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు. కొత్త స్ట్రెయిన్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అపోహల్ని నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇంత భరోసాగా చెబుతున్నా.. కొత్త వైరస్ టెన్షన్ మాత్రం ఏపీ ప్రజల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ కొత్త స్ట్రెయిన్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరుగురిలో గుర్తించటం తెలిసిందే.