మనం ఒకరిని వేలెత్తి చూపిస్తే.. మరో నాలుగు వేళ్లు మనవైపు చూస్తుంటాయన్న చిన్న విషయాల్ని వదిలేసి.. నీతులు ఎదుటోడికి చెప్పేందుకే కానీ తమకు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మోడీషాలు. వారసత్వ రాజకీయాల గురించి సుద్దులు చెప్పే మోడీ.. తన నీడలాంటి అమిత్ షా కుటుంబాన్ని మాత్రం మర్చిపోతుంటారు. ఇప్పటివరకు అమిత్ షా అందరిని అనటమే కానీ అనిపించుకున్నది లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు కమ్ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి చేసిన విమర్శలపై అమిత్ షాకు దిమ్మ తిరిగేలా పంచ్ ఎదురైంది.
ఇటీవల కాలంలో తమిళనాడు మీద బీజేపీ ఫోకస్ పెంచింది. తరచూ తన ప్రసంగాల్లో మోడీ తమిళనాడు ప్రస్తావన తీసుకురావటం.. తమిళ ప్రముఖలను కీర్తించటం ఎక్కువైంది. అదే సమయంలో షాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు తరచూ తమిళనాడులో పర్యటిస్తూ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ ఫలితం పెద్దగా లేని పరిస్థితి.
తాజాగా రామేశ్వరం నుంచి బీజేపీ చీఫ్ అన్నమళై పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా.. పనిలో పనిగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని.. ఆయన కుమారుడి మీద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే వారసత్వ పార్టీ అన్న ఆయన.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను మంత్రి చేశారని.. మరికొంత కాలానికి ఆయన్ను ముఖ్యమంత్రి చేస్తారన్నారు.
దీనిపై ఉదయనిధి అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. ఇటీవల కాలంలో ఎవరూ ప్రస్తావించని అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. వారసత్వ రాజకీయాల గురించి నీతులు చెబుతున్న అమిత్ షా.. తన కొడుకును బీసీసీఐ సెక్రటరీగా ఎలా నియమించారు? అని ప్రశ్నించారు. ‘అతను ఎన్ని క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు? అతను ఎన్ని పరుగులు తీశారు? ఆయన్ను ఏ ప్రాతిపాదికన తీసుకున్నారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వారసత్వం పేరుతో అందరిని ఆడిపోసుకునే అమిత్ షాకు.. ఉదయనిధి ఇచ్చిన పంచ్ మరో లెవల్ లో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. షా ఎలా రియాక్టు అవుతారో?