తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసీన్ ట్రస్టు భూముల వ్యవహారం చాలా కాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలో ఈ ట్రస్టుకు సంబంధించిన 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై చాలా ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. మొత్తం 540 ఎకరాల భూమి విషయంలో ఉదాసీన్ ట్రస్టుకు, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు మధ్య వివాదం చాలా కాలంగా కోర్టులో నలుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే 540 ఎకరాల భూమి తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసీన్ ట్రస్టుదేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలో ఉన్న ఉదాసీన్ మఠం తన పరిధిలోని 540 ఎకరాల భూములను గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు లీజుకిచ్చింది. 1964 నుంచి మొత్తం నాలుగు దఫాలుగా 99 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇచ్చింది.
అయితే, బఫర్ జోన్ లో ఉన్న ఆ భూముల్లోని 535 ఎకరాలలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. దీంతో, ఆ కంపెనీ నిర్ణయాన్ని ట్రస్టు సవాల్ చేస్తూ దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. దీంతో ట్రస్ట్ కు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందిజ అయితే, ఆ తీర్పుపై గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై విచారణ జరిపిన దేశపు అత్యున్నత న్యాయస్థానం ఉదాసీన్ ట్రస్ట్ కే అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ భూములను రక్షించేందుకు ఆ శాఖ అధికారులు, న్యాయవాదులు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు.