కస్టడీలో ఎంపీని చితక్కొట్టి గాయాలకు మసిపూశారు
వాస్తవాలు దాచి హైకోర్టుకు నివేదిక
రఘురామ వ్యవహారంలో..ఒత్తిళ్లకు లొంగిన గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు?
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిపోర్టుతో బట్టబయలు
జగన్ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం
ఇంటా, బయటా విమర్శలతో ఇరకాటంలో సీఎం
బయటపడేయాలని కోరేందుకే అమిత్ షాతో భేటీ?
నవ్యాంధ్రలో జగన్ ప్రభుత్వ దమనకాండకు మరో నిలువెత్తు సాక్ష్యం.. ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోయారో.. ఏ స్థాయిలో ‘బెదిరింపులు’ ఎదురయ్యాయో తెలియదు! కానీ.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తగిలిన గాయాల విషయంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తిమ్మిని బమ్మి చేసిన వైనం బహిర్గతమైంది. అధికారంలో ఉన్న నిరంకుశులైతే ఏం చేయగలరో ఈ ఉదంతం రుజువుచేసింది. సొంత పార్టీకి చెందిన ఎంపీని సీఐడీ కస్టడీలో చితకబాది.. సీఎం జగన్ బెయిల్‌ను రద్దుచేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం చూసి యావద్దేశం షాక్‌కు గురైంది.
రఘురామ కాలిపై గాయాలను పరిశీలించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సిన మెడికల్ బోర్డు కూర్పులో జరిగిన మతలబులు ఇప్పటికీ సంచలనం సృష్టిస్తుండగా.. గాయాలకు మందు పూయాల్సిన డాక్టర్లు.. వాస్తవాలకే ముసుగు వేశారని తెలిసి జనం విస్తుపోతున్నారు. రఘురామకు వైద్య పరీక్షలు చేసిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఆయన కాళ్లకు దెబ్బలు తగిలినట్లు స్పష్టంగా గుర్తించారు. ఎంపీని జీజీహెచ్‌కు తరలించిన వెంటనే.. ఔట్ పేషంట్ (ఓపీ) చీటీ రాసిన తర్వాత కొంత మంది వైద్యులు ఆయన్ను పరీక్షించారు. ఆ సమయంలో రఘురామ తనను కొంతమంది లాఠీలతో కొట్టినట్లు సమాచారమిచ్చారు.
మే 15వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైద్యులు ఆయన కాళ్లను పరీక్షించారు. ఆ సమయంలో ఎంపీ కుడి కాలు, కాళ్ల వేళ్ల కింద చర్మం కమిలిపోవడంతోపాటు కాళ్లలో వాపు, కొంత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలను ఓపీ చీటీలో స్పష్టంగా నమోదు చేశారు. ఇందులో ‘కంట్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించారు. కంట్యూషన్ అంటే దెబ్బతగలడం వల్ల చర్మం కమిలిపోయిందని అర్థం. అలాగే.. ‘‘ఎంపీ కుడి కాలు, కాలి వేళ్ల కింద భాగం బాగా దెబ్బతింది. చర్మం కింద రక్తస్రావం కనిపించింది’’ అని కూడా నిర్ధారించారు. ఇక.. ఎంపీని ఇన్‌పేషంట్‌గా అడ్మిట్ చేసుకున్న అనంతరం రాసిన కేస్ షీట్లో కూడా ఇవే వివరాలు ఉన్నాయి.
గాయం.. మాయం
రఘురామరాజు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యే వరకూ ఆయన కాళ్లకు దెబ్బలు తగలడం వల్లనే వాపు, రంగు మార్పు, రక్తస్రావం జరిగినట్లు వైద్యులు చెబుతూ వచ్చారు. కానీ కోర్టుకు అందించిన నివేదికలో ఇవేమీ లేవు. ఓపీ చీటీలో, కేస్‌షీట్‌లో పేర్కొన్న వివరాలకు భిన్నంగా నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం పేషంట్ (ఎంపీ) పరిస్థితి సాధారణంగా ఉంది. ఆయనకు పైకి కనిపించే దెబ్బలు లేవు. క్లినికల్ ఎగ్జామినేషన్‌లో మేం గుర్తించినవేవీ.. ఆయన ఆరోపించినట్లుగా ఎవరో కొడితే ఏర్పడినవి కావు’ అని తేల్చేశారు.
ఎవరూ కొట్టకపోతే కాళ్లు ఎందుకు వాచాయి? రంగు ఎందుకు మారిందో చెప్పకుండానే అసమగ్ర నివేదికను రూపొందించి ఏకంగా హైకోర్టుకే పంపారు. ఆయన అరికాళ్లు ఎందుకు కమిలిపోయాయి? ఎందుకు వాచాయనేదే డాక్టర్లు తేల్చాలి. నిజానికి.. మెడికల్ బోర్డులోని వైద్యులు ఈ ప్రయత్నం కూడా చేశారు. దీనిపై వారు ఆయనకు కలర్ డాప్లర్ టెస్ట్ చేశారు. దీని రిపోర్టులో కూడా కాళ్లలో కొంత రక్తస్రావం ఉన్నట్లు, నరాలు వాచినట్లు తేలింది. ‘గ్రేడ్ -1 రిఫ్లెక్షన్స్’ ఉన్నట్లు స్పష్టమైంది. రెండు కాళ్లలో వాపు ఉన్నట్లు తేలింది.
అయినా సరే.. కలర్ డాప్లర్ టెస్ట్ ఫలితాల గురించి హైకోర్టు నివేదికలో పొందుపరచనే లేదు. అసలా ప్రస్తావనే లేదు. బీపీ బాగుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయి, గుండె బాగుంది, మూత్రపిండాలు బాగున్నాయి, పేషంట్ స్టేబుల్‌గా ఉన్నాడు… అంటూ బారెడు రాసి.. అసలైన కాళ్ల వాపులు, కందిన చర్మం గురించి మాత్రం రెండే రెండు లైన్లు నామమాత్రంగా రాసేశారు. ఎంపీ మెడికల్ ఎగ్జామినేషన్ విషయంలో సూపరింటెండెంట్ దగ్గర నుంచి బోర్డు సభ్యుల వరకూ అంతా ఇరుక్కుపోయినట్లేననే చెబుతున్నారు.
నివేదిక సమర్పణలో జాప్యం, కోర్టు అధికారి నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినా స్పందించకపోవడంపై ఇప్పటికే సూపరింటెండెంట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో సదరు వైద్యులు కలవరపడుతున్నారు. తప్పుడు నివేదిక ఇచ్చినందుకు న్యాయస్థానాలు శిక్షిస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
మెడికల్ బోర్డునే మార్చేశారు!
రఘురామ గాయాలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించగానే.. గుంటూరు బోధనాస్పత్రి సూపరింటెండెంట్ తాను చైర్మన్‌గా ఉంటూ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్లతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే సీన్ మారింది. ఆ బోర్డు నుంచి జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ను గుట్టుచప్పుడు కాకుండా తప్పించారు. ‘ఆ ప్రొఫెసర్‌కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు’ అంటూ కొత్త కథ అల్లారు.
గాయాల విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెబుతారనే ఆందోళనతోనే ఆ ప్రొఫెసర్‌ను వ్యూహాత్మకంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను చేర్చారు. గాయాల నిర్ధారణలో కీలకమైన ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ విషయంలోనూ ఇదే మతలబు జరిగింది. సదరు ప్రొఫెసర్ ఈ తతంగాన్ని గమనించి.. స్వయంగా తప్పించుకున్నారు. దీంతో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ కాకుండా ఆసిస్టెంట్ ప్రొఫెసర్‌తో నివేదికపై సంతకం పెట్టించారు.
ఒత్తిడితో మధ్యేమార్గం…
ఎంపీని పరీక్షించిన వైద్యులకు ఆయన కాళ్లపై దెబ్బలు స్పష్టంగా కనిపించాయి. అయినప్పటికీ.. అధికారులు అసంపూర్ణంగా నివేదిక రూపొందించి, దానిపై సంతకం పెట్టాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు వైద్యులు అంగీకరించలేదు. దీనిపై సంతకం పెడితే ఇరుక్కుపోతామని తేల్చిచెప్పారు. కనీసం ‘వాపు ఎందువల్ల వచ్చిందో మాత్రం తెలియదు’ అనైనా నివేదికలో ఉండాలని పట్టుపట్టారు.
దీంతో అధికారులు అప్పటికప్పుడు రిపోర్టును మార్చారు. మెడికల్ బోర్డు ఏర్పాటు దగ్గర నుంచి సభ్యులను తొలగించడం, అసంపూర్తిగా నివేదిక ఇవ్వడం వరకూ అంతా నాటకీయమే! దీంతో నివేదిక ఇవ్వడంలో బాగా జాప్యం జరిగింది. నివేదిక ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని సూపరింటెండెంట్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జీజీహెచ్ వైద్యులకు భిన్నంగా.. రఘురామరాజు పాదాలకు గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక తేల్చింది.
ఆయన పాదాలను ఆస్పత్రి వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రెండు పాదాలూ కింది వైపు మూడోవంతు బాగా ఉబ్బి ఉన్నాయని, అరికాళ్లు కూడా బాగా వాచాయని పేర్కొంది. కుడి పాదం అరికాలి భాగం వేళ్ల వరకు, ఎడమ కాలు మధ్య, ముందుభాగాలు, అరికాలు, రెండో వేలు బాగా కమిలిపోయాయని నిర్ధారించింది. కుడి పాదం చీలమండ ఎముక, అరికాలు, ఎడమ పాదం మడమ, రెండో వేలు సున్నితంగా మారాయని, వాటిని ముట్టుకుంటే ఆయనకు నొప్పి కలుగుతోందని తెలిపింది.
కుడికాలి చీలమండ కదలికలు సాధారణంగా ఉన్నాయని, ఎడమకాలి చీలమండ కదిపితే నొప్పి వేస్తోందని.. కుడి, ఎడమ పాదాల ముందువైపు కీళ్లు, జాయింట్లు నొప్పి కలిగిస్తున్నాయని పేర్కొంది. ఎడమ పాదం రెండో వేలు ఎముక విరగనప్పటికీ దూరమైందని ఎక్స్ రే నివేదిక ఆధారంగా నిర్ధారించింది. ఈ నివేదికను బట్టే రఘురామరాజుపై సీఐడీ కస్టడీలో అధికారులు అనుచితంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు వెళ్తుందోనని ప్రభుత్వ పెద్దల్లోనూ వణుకు మొదలైంది.
అమిత్ షాను కలిసింది అందుకేనా?
అటు సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్‌పై విచారణ, ఇటు ఎంపీ వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణ సీఎం జగన్‌ను ఇరకాటంలో పడేశాయని.. అందుకే ఆయన హడావుడిగా కేంద్ర హోం మంత్రి అమితషాను కలిశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇతర మంత్రులను కలిసి.. చాలా అంశాలు మాట్లాడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటన విడుదల చేసినా.. లోపల ఏం జరిగిందో విశ్లేషకులు పసిగట్టారు. తన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో రఘురామరాజు పిటిషన్ వేయడం, తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలను జగన్ ప్రస్తావించినట్లు సమాచారం.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని.. రఘురామరాజుపై అనర్హత వేటువేయాలని తాము సమర్పించిన పిటిషన్‌పై స్పీకర్ చర్య తీసుకోకపోవడం వల్లే ఆయన రెచ్చిపోయి తనపై వ్యాఖ్యలు చేశారని చెప్పినట్లు సమాచారం. వీటన్నిటి విషయంలో తనకు కేంద్రం మద్దతునిచ్చి పాలన సజావుగా నడిగేందుకు వీలు కల్పించాలని, అందుకు బదులుగా తాము కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని జగన్ చెప్పినట్లు తెలిసింది.
సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ గురించి షా ప్రతిస్పందించలేదని.. జగన్‌పై న్యాయవ్యవస్థ నుంచి వస్తున్న విమర్శలు, రఘురామరాజు పట్ల వ్యవహరించిన తీరుపై మాత్రం ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని పరిణామాలు జరిగినప్పుడు కేంద్రమే కాదు, ఎవరూ సమర్థించ లేని పరిస్థితి తలెత్తుతుందని హోం మంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం.