ఇటీవల కాలంలో ప్రముఖుల ఖాతాలను నిలిపివేయడం, ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లపై నిబంధనల కొరడా ఝళిపించడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్న ట్విట్టర్.. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా విషయంలోనూ ఇలానే చేతులు కాల్చుకుంది.
ముందు ఇన్సల్ట్ చేసేసి.. తర్వాత తప్పు సరిదిద్దుకున్నట్టు పేర్కొంది. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు అనేక సందేశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖులు వినియోగించే ట్విట్టర్ ఖాతాలకు సహజంగానే ఇచ్చే `బ్లూ బ్యాడ్జ్`ను ట్విట్టర్ కొనసాగిస్తోంది.
అయితే.. ఏమైందో ఏమో.. హఠాత్తుగా ఈ `బ్లూ బ్యాడ్జ్`ను ట్విట్టర్ యాజమాన్యం.. ఉపరాష్ట్రపతి ఖాతా నుంచి తొలగించింది. దీంతో ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతా ప్రాధాన్యం కోల్పోయినట్టయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉపరాష్ట్రపతి ఖాతాకు బ్లూ బ్యాడ్జ్‌ను ఎందుకు తొలగించారంటూ.. నెటిజన్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. దీంతో ట్విట్టర్ యాజమాన్యం కొద్ది గంటల్లోనే బ్లూ బ్యాడ్జ్‌ను పునరుద్ధరించింది. వాస్తవానికి 2013, ఆగస్టు నుంచి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు.
ఆయనకు అప్పటి నుంచి కూడా బ్లూ బ్యాడ్జ్ ఉంది. అయితే.. ఇలా హఠాత్తుగా తొలగించడంతో.. ఇది కేంద్రం వర్సెస్.. ట్విట్టర్ సంస్థకు మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో భాగమేనని అందరూ అనుకున్నారు.
ఇలా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తేసరికి తప్పు సరిదిద్దుకున్న ట్విట్టర్.. దీనిపై చిత్రమైన వివరణ ఇచ్చింది.. సంబంధిత ఖాతాను ఉపయోగించి ఎక్కువ రోజులు గడిస్తే బ్లూ టిక్ తీసివేయొచ్చని ట్విట్టర్ నిబంధనల్లో ఉందని పేర్కొంది.
2020 జులై 23న వెంకయ్య నాయుడు ఈ ఖాతా నుంచి ట్వీట్ చేశారని, తర్వాత దీనిని వాడలేదని… అందుకే బ్లూట్ టిక్‌ను తొలగించామని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత.. బ్లూ బ్యాడ్జ్‌ను కొనసాగింది. ఏదైతేనేం.. కొన్ని గంటల పాటు.. ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.