పంతం…పంతం…పంతం…నీదా..నా
తాజాగా ఏపీలో సినిమా టికెట్లపై రేగిన వివాదం వ్యవహారంలోనూ జగన్ సర్కార్ తన పాత పంథాలోనే వెళుతోంది. టికెట్ రేట్లను తగ్గిస్తూ తెచ్చిన జీవో నెంబర్.35ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టి వేస్తే…తగ్గేదేలే అంటూ డివిజన్ బెంచ్ కు వెళ్లింది. జాయింట్ కలెక్టర్ల దగ్గర తమ రేట్లను పొందుపరిచి అనుమతులు తీసుకోవాలని థియేటర్ల యజమానులకు హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించడంతో….జగన్ సర్కార్ తాజాగా మరో మెలిక పెట్టింది.
పిటిషన్ వేసిన కొన్ని థియేటర్లకు మాత్రమే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వర్తిస్తుందని ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి షాకిచ్చారు. ఆ థియేటర్లు మాత్రమే పాత విధానం ద్వారా టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవచ్చని తెలిపారు. మిగతా థియేటర్లకు జీవో నెం.35 అమల్లోనే ఉందని బాంబు పేల్చింది. ఇక, ఈ విషయం హైకోర్టు తీర్పు కాపీలో కూడా ఉందని చెప్పడం కొసమెరుపు. అంటే, డివిజన్ బెంచ్ తాజా తీర్పు ప్రకారం తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు మాత్రమే పాత రేట్ల విధానం వర్తిస్తుంది.