తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీతో పోరాడుతున్నా రు. ధాన్యం సేకరించి తీరాల్సిందేనని.. పట్టుబడుతున్నారు. తెలంగాణ తడాఖా ఏంటో కేంద్రానికి రుచి చూపిస్తామని.. చెప్పారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 1 తర్వాత.. అంటూ.. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈ విషయం కాంగ్రెస్ కీలక నాయకుడు-కేసీఆర్ కుమార్తె కవితకు మధ్య రాజకీయ మంట పెట్టింది. రాష్ట్రంలో ధాన్యం అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన అటు బీజేపీ, ఇటు కేసీఆర్‌ను తిట్టిపోశారు. ధాన్యం సేకరణలో బీజేపీ, టీఆర్ ఎస్ ప్రభుత్వాల వైఖరిని రాహుల్ గాంధీ ఎండగట్టారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. అయితే.. రాహుల్ ట్వీట్‌పై స్పందించిన సీఎం గారాలపట్టి, ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం చెప్పడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ధాన్యం సేకరణలో బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వాల వైఖరి సిగ్గుచేటని రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. వారి శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.
అన్నం పెట్టే రైతన్నను ఇబ్బంది పెట్టడం ఆపి.. వారి వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలని రాహుల్ డిమాండ్ చేశారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు తెలంగాణ రైతుల తరఫున కాంగ్రెస్ నేతలుగా తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. ఈ ట్విట్ రాజకీయ దుమారం రేపింది. దీనిపై వెంటనే స్పందించిన కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్లో సంఘీభావం చెప్పడం సరికాదని హితవు పలికారు.
ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్, హరియాణాలో చేసినట్లు ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్న కవిత.. టీఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకే దేశం – ఒకే సేకరణ విధానం కోసం పార్లమెంటులో రాహుల్ డిమాండ్ చేయాలన్నారు. టీఆర్ ఎస్ ఎంపీలకు మద్దతుగా నిలవాలని సూచించారు. అంతేతప్ప.. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే..ప్రయోజనం లేదని అన్నారు.