కర్ణాటకలోని హోస్పేట తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయింది. దీంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. ఎగువ నుండి వరద తగ్గడంతో రాత్రి 11 గంటలకు గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో 35 వేల క్యూసెక్కులు నదిలోకి పోతున్నాయి.
గత 70 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం నుండి 60 టీఎంసీల బయటకు నీళ్లు వదిలితే గానీ గేటు పునరుద్దరణకు అవకాశం లేకపోవడంతో డ్యాంకు ఉన్న 33 గేట్లను తెరిచి నీళ్లను కిందకు వదులుతున్నారు.
డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం, కర్ణాటకలోని బళ్లారి, కోప్పల్, హోస్పెట్, రాయ్ చూర్, జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. షిమోగా ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్యాంలోకి నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుండి వరద ఆగడంతో పాటు, డ్యాంలో నీరు తగ్గితేనే గేట్ పునరుద్దరణకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.