ఏపీలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ నుండి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. చాలాకాలంగా ఏపీలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చింతామోహన్ కూడా పోటీ చేస్తున్నారు. వీరితో పాటు సీపీఎం అభ్యర్ధి కూడా ఉన్నారు.
విశ్లేషకులు అందరూ పోటీ వైసీపీ టీడీపీ మధ్య అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కొత్త ఆశలు వ్యక్తంచేస్తున్నారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ లేని లోటు అర్థమైందని, కాంగ్రెస్ అనేది విశ్వసనీయమైన పార్టీ అని తెలిసివచ్చిందని ఈసారి తిరుపతిలో మా సత్తా చూపుతాం అంటున్నారు. వారు సత్తా చూపుతారో లేదో తెలియదు గాని చింతా మోహన్ మంచి కెపాసిటీ ఉన్న అభ్యర్థి అన్నది మాత్రం నిజం. అందుకే కాంగ్రెస్ నేతల్లో కాస్త ఆశలు చిగురించాయి. గెలుపు కోసం కాదు, ఓట్ల శాతం పెంచుకోవడానికి మాత్రమే.
తాజాగా ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి బాబు, మోడీ, జగన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం మోదీ అని, చంద్రబాబు, జగన్‌లు రాహుకేతువులని మండిపడ్డారు. రాష్ట్రానికి దోషం పట్టినట్టే ఉన్నాయి పరిస్థితులు. తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రానికి దోష విముక్తి చేయాలని కోరారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం చరిత్రాత్మకం కావాలని అన్నారు.
వైసీపీ పేరు నకిలీ. అద్దెకు తెచ్చుకున్నది… అందుకే ఆ పార్టీ నాయకులే పలకరన్న తులసిరెడ్డి అది కాంగ్రెస్ నకిలీ పార్టీ అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎంతో అనుభవం ఉందని, ఆయనకు ఓటేస్తే గతంలో చేసినట్టే తిరుపతిని మంచిగా అభివృద్ధి చేస్తారన్నారు.