ముక్కుసూటిగా వ్యవహరించటంతో పాటు..తిరుమల క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించటం.. లో ప్రొఫైల్ మొయింటైన్ చేసే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవటం.. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సింఘాల్ ను బదిలీ చేయటం ఆసక్తికరంగా మారింది.
సింఘాల్ స్థానంలో టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని నియమిస్తారని… తాజా సమాచారం వస్తోంది. ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ రెడ్డికి అలవాటు. మరి టీటీడీ ఈవో పోస్టును బీసీలకు వాళ్లకీ వీళ్లకి ఇవ్వడానికి జగన్ ఏమీ చంద్రబాబులా ఆలోచించే ముఖ్యమంత్రి కాదుగా… వెతికి వెతికి దేశంలో రెడ్డి ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తారు. ఆ క్రమంలో మరో రెడ్డికి ఆ కీలక పోస్టు దక్కనుంది.
ఇదిలా ఉండగా సింఘాల్ 2017లో టీటీడీ ఇవోగా వచ్చారు. 2019లో ఆయన రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకు ఏడాది డిప్యుటేషన్ ఇచ్చి పొడగించింది. తాజాగా ఆ టైం కూడా పూర్తైంది. దీంతో.. ఆయన బదిలీ అనివార్యమైంది. తాజాగా ఆయన స్థానంలో అదనపు ఈవోగా వ్యవహరిస్తున్న ధర్మారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీకి ఈవోలుగా ఎంతోమంది పని చేసినా.. కొద్ది మంది మాత్రం తమ పదవీ కాలంలో తమదైన ముద్రను వేస్తారు. అనిల్ కుమార్ సింఘాల్ సైతం ఆ కోవకు చెందిన వారేనని చెప్పాలి. తిరుమలకు వచ్చే సామాన్యులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇచ్చే లక్షణం ఆయనలో కనిపిస్తుంటుంది. అందుకు తగ్గట్లే ఆయన నిర్ణయాలు ఉంటాయని చెబుతారు.
భక్తులు క్యూ లైన్లలో గంటల కొద్ది వేచి చూడటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దానికి చెక్ చెప్పేందుకు వీలుగా టైం స్లాట్ విధనాన్ని తీసుకొచ్చారు. మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు టీటీడీ ఈవోగా వ్యవహరించిన ఆయన్ను ఏపీ సర్కారు సాగనంపిన తీరు ఇప్పుడు చర్చగా మారింది. ఇటీవల కాలంలో ఆయనకు ఈసారి బదిలీ తప్పదన్న ఊహాగానాలు వ్యక్తం కాగా.. అందుకు తగ్గట్లే ఆయన్ను బదిలీ చేయటం గమనార్హం.