తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. కోరిన కోరికలు తీర్చే ఆ వడ్డీకాసులవాడిని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతంతకూ పెరుగుతోంది. ప్రతి నెలా రూ. 100 కోట్లు పైగా హుండీ ఆదాయం జమ అవుతోంది. దీంతో గత ఆరు నెలలు తిరుమలేశుడి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది
బంగారం, వెండితో పాటు విలువైన కానుకలు ఆ వైకుంఠవాసుడి సొంతం కాగా.. 2024 సంవత్సరంలో మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ. 670.21 కోట్లుగా జమైందని టిటిడి ప్రకటించింది. అలాగే నెలల వారీగా ఆదాయాన్ని కూడా వెల్లడించింది జనవరి నెలలో రూ. 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 111.71 కోట్లు, మార్చిలో రూ. 118.49 కోట్లు, ఏప్రిల్ లో రూ. 101. 63 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి భక్తులు చల్లించగా.. మే నెలలో రూ. 108.28 కోట్లు, జూన్ నెలలో రూ. 113.64 కోట్లు ఆదాయం వచ్చింది.
అంతేకాకుండా ఏడు నెలల క్రితం వెంకన్న పేరిట ఉన్న ఆస్తులు వివరాలను కూడా టిటిడి బయటపెట్టింది. 2023 అక్టోబర్ 31 నాటికి మొత్తం 24 బ్యాంకు ఖాతాల్లో ఏడుకొండలవాడికి రూ. 17,816.15 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్ లుగా ఉన్నట్లు టిటిడి పేర్కొంది.