తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కేసు విచారణలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరని ఆయన వ్యాఖ్యానించారు.
తాము కూడా శ్రీవారి భక్తులమేనని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. కేసు విచారణ సమయంలో సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని తెలిపారు.
‘‘పూజలు సక్రమంగా జరగకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరు. ఆయన మహిమలు అందరికీ తెలుసు“ అని సీజేఐ అన్నారు. అయితే అసలు పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సదరు పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ.. పిటిషనర్ శ్రీవారి దడ్డాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“మీరు శ్రీవారి భక్తులు కదా. అయితే.. కొంత ఓపిక పట్టండి. ప్రతి రోజూ మీ పిటిషన్‌ను ఫైల్ చేయమని.. రిజిస్ట్రీని ఒత్తిడి చేయకండి. ఇది సరైన విధానం కాదు. మేం కూడా శ్రీబాలాజీ భక్తులమే“ అని పేర్కొన్నారు.
తిరుమలలో జరుగుతున్న సేవలు నియమబద్ధంగా ఆగమోక్తంగా సాగడం లేదంటూ.. దడ్డా.. పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనంలోని మిగిలిన న్యాయమూర్తులు.. జస్టిస్ సుర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలు.. మాట్లాడుతూ.. పిటిషన్‌పై తొందర వద్దని.. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటామని.. అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించారు. కోర్టు చెబుతున్న విషయాలను ఆలకించాలని సూచించారు.
మరోమారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని.. రాజ్యాంగ బద్ధమైన సుప్రీం కోర్టు.. అసలు పూజల విజయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. సుప్రీం కోర్టు స్థానిక కోర్టు కాదని.. దీనికి కొన్ని విధివిధానాలు ఉంటాయని చెప్పారు.
అయితే.. ఈ సందర్భంగా పిటిషనర్ జోక్యం చేసుకుని.. ఇది తన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. మరోసారి ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. పూజలు ఎలా చేయాలో చెప్పడం అనేది ప్రాథమిక హక్కా? అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాము.. టీటీడీలో ఆగమోక్తంగానే క్రతువులు జరుగుతున్నాయని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కోర్టు కు హాజరైన టీటీడీ స్థాయి సంఘానికి కూడా ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు సంధించారు. దడ్డా వేసిన పిటిషన్‌పై ఏం చెబుతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సమాచారం తమకు అందించాలని ఆదేశించారు. అంతేకాదు.. పిటిషనర్ తమ దృష్టికి కొన్ని కీలక విషయాలు తీసుకువచ్చారని.. పూజలు, కైంకర్యాలు ఆగమోక్తంగా జరగడం లేదని తెలిపారని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు.
అయితే.. ఇది న్యాయపరమైన హక్కుగా పిటిషనర్‌కు వర్తించదని పేర్కొన్నారు. అయినప్పటికీ.. టీటీడీలో ఏం జరుగుతోందో తమకు చెప్పాలని.. ఆదేశించారు. అనంతరం విచారణనను వచ్చే నెల 6కు వాయిదా వేశారు.
అయితే.. కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో సంభాషించడం విశేషం. పిటిషనర్‌ను ఓపిక పట్టాలంటూ.. ఆయన తెలుగులోనే సూచించారు. అయితే.. టీటీడీ తరఫు వాదనలను కూడా వినాల్సిఉందని.. చెప్పారు.
ఇదిలావుంటే.. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. టీటీడీలో అసలు ఏ విధంగా పూజలు , కైంకర్యాలు సాగుతున్నాయో.. టీటీడీ నుంచి వివరణ తీసుకోవాలని.. అభ్యర్థించారు. కాగా, గతంలో ఇదే కేసుపై శ్రీవారి దడ్డా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే.. ఈ కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో సుప్రీం కోర్టుకు చేరింది.