తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు తాను వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టానని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తండ్రి బాటలోనే షర్మిల..తెలంగాణలో పాదయాత్ర మొదలుబెట్టారు. చేవెళ్ల నుంచి మొదలైన పాదయాత్ర కొనసాగుతోంది. షర్మిల పార్టీ ఆమె సొంత వ్యవహారమని, జగన్ వద్దన్నా వినకుండా షర్మిల పార్టీ పెట్టుకుందని సజ్జల సహా పలువురు వైసీపీ నేతలు పలుమార్లు నొక్కి వక్కాణించారు.
దీనికితోడు, షర్మిల పార్టీపై జగన్ ఇప్పటివరకు ఎటువంటి కామెంట్లు చేయలేదు. అంతేకాదు, షర్మిల పార్టీ పెట్టిన తర్వాత అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వచ్చింది. కానీ, షర్మిల…జగన్, కేసీఆర్ లు కలిపి వదిలిన బాణమేనని పలువురు తెలంగాణ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తాజాగా ఆ ఆరోపణలకు ఊతమిచ్చేందుకు తాజా ఘటనే నిదర్శనమని అంటున్నారు. షర్మిల ఐదో రోజు పాదయాత్రలో టీటీడీ చైర్మన్, వైఎస్ జగన్ బాబాబు వైవీ సుబ్బారెడ్డి పాల్గొనడం వెనుక జగన్ ఉన్నారని విపక్ష నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.
షర్మిల, వైవీల భేటీ దాదాపు గంటపాటు సాగిందని, షర్మిల పాదయాత్రకు వైవీతోపాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సంఘీభావం తెలిపారని అంటున్నారు. జగన్ రాయబారిగానే షర్మిలను వైసీపీ నేతలు కలిశారని చెబుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిని వైఎస్సార్ టీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్ర జరిగిన తీరును వైవీ సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు.
త్వరలోనే వైఎస్ విజయమ్మను కూడా వైవీ సుబ్బారెడ్డి కలుస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీ వెనుక జగన్ ఉన్నారని అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి. పైకి మాత్రం అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం చేస్తున్నారని, వైఎస్సార్ టీపీకి జగన్ సపోర్టు ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.