దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, ఉత్తర న్యూజిల్యాండ్ సముద్రగర్భంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూ కాలిడోనియాలోని వావోకు తూర్పున 415 కిలోమీటర్లు దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ ఏర్పడిందని ఆస్ట్రేలియా తెలిపింది. లార్డ్ హౌ ద్వీపానికి సునామీ ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ట్విటర్లో పేర్కొంది.
ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి తూర్పున 550 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. న్యూజిల్యాండ్ లో ఈ భూకంపం ప్రభావం వల్ల పొరుగునున్న ఫిజీ, పనౌరు దేశాల్లో సునామీ వచ్చే ప్రమాదముందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుజాగ్రత్తగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. దీంతో, సముద్ర తీరప్రాంతాల్లోని ప్రజలు సముద్రానికి దూరంగా ఉండాలని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది.
సముద్ర తీరాలు, హార్బర్లు, నదులకు దగ్గరగా ఉండకూడదని ప్రజలకు సూచించింది. 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినందున న్యూజిలాండ్ తీరంలో బలమైన, అసాధారణమైన అలలు వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ ఉత్తర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని పలు సంస్థలు కూడా తెలిపాయి. ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీరాల్లోని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అయితే, సముద్రానికి చాలా లోతులో భూకంప కేంద్రం ఉన్నందున న్యూజిల్యాండ్ కు సునామీ ప్రమాదం తప్పినట్టేనని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలల తీవ్రత కూడా తగ్గుముఖం పడుతున్నందును సునామీ హెచ్చరికలను వెనక్కు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సునామీ ముప్పు లేకపోయినా…సముద్ర తీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు.